శంకర్ దాదా చలో అమెరికా.. మెగాస్టార్ సిద్ధమేనా?
మున్నా భాయ్ MBBS ఫ్రాంచైజీలో రెండు సినిమాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Oct 2024 9:34 AM GMTమున్నా భాయ్ MBBS ఫ్రాంచైజీలో రెండు సినిమాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో భాగం చిత్రీకరణ కోసం హిరాణీ సన్నాహకాల్లో ఉన్నారు. ప్రధాన తారలు సంజయ్ దత్, అర్షద్ వార్సీ తిరిగి వారి పాత్రలను పోషిస్తారని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దర్శకనిర్మాత రాజ్‌కుమార్ హిరాణీ మున్నా భాయ్ 3ని రూపొందించడం తన ప్రధాన ప్రాధాన్యత అని వెల్లడించి అభిమానుల ఉత్సాహానికి మరింత ఊపు తెచ్చారు.
తాజా చాటింగ్ సెషన్‌లో ఔత్సాహిక ప్రేక్షకులతో మాట్లాడుతూ.. రాజ్‌కుమార్ హిరాణీ తన వరస ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ``మున్నా భాయ్ కోసం నా దగ్గర ఐదు సగం పూర్తయిన స్క్రిప్ట్‌లు ఉన్నాయి. నేను స్క్రిప్ట్‌పై ఆరు నెలలు గడిపాను.. ఇంటర్వెల్‌కి చేరుకున్నాను.. అది అంతకు మించి ముందుకు వెళ్ళలేదు. మున్నా భాయ్ LLB, మున్నా భాయ్ చల్ బేస్, మున్నా భాయ్ చలే అమెరికా ఇలా ఐదు ఐడియాలు ఉన్నాయి``అని అన్నారు. షారుఖ్ ఖాన్ నటించిన డుంకీకి దర్శకత్వం వహించిన తర్వాత మున్నాభాయ్ కాన్సెప్ట్ పైనా హిరాణీ పని చేస్తున్నారని కూడా దీనిని బట్టి అర్థమైంది.
అత్యంత కీలక అంశం ఏమిటంటే... ``సీక్వెల్స్ లో రాబోయేది ఎప్పుడూ గత చిత్రాల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ఇప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. వాస్తవానికి 100 సంవత్సరాల సినీపరిశ్రమ కాలంలో ప్రతి కథ తెరపై చూపించేసారు. కానీ నేను నాదైన ఆలోచనపై పని చేస్తున్నాను`` అని అన్నారు. సీక్వెల్లో మూడో సినిమా చేయడం అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని కూడా హిరాణీ తెలిపారు. ఎందుకంటే సంజూ మా ఇంటికి వచ్చి తదుపరి చిత్రాన్ని(మున్నాభాయ్ 3) పూర్తి చేయమని నన్ను బెదిరించే అవకాశం ఉంది. సంజయ్‌కి మరో మున్నా భాయ్ సినిమా చేయాలని ఉంద``ని రాజ్‌కుమార్ హిరాణీ సాబ్ వెల్లడించారు. తదుపరి మున్నా భాయ్ 3తో ముందుకు వెళ్లాలని తాను సీరియస్‌గా ఆలోచిస్తున్నానని కూడా చెప్పాడు.
ఈ సిరీస్ గురించి వివరాల్లోకి వెళితే.. మున్నా భాయ్ సిరీస్‌కు రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. సంజయ్ దత్ మున్నా భాయ్‌గా - అర్షద్ వార్సీ సర్క్యూట్‌గా నటించారు. మొదటి రెండు చిత్రాల (మున్నా భాయ్ MBBS (2003) - లగే రహో మున్నా భాయ్ (2006) విజయం తర్వాత మూడవ చిత్రం `మున్నాభాయ్ చలే అమెరికా` అనే పేరుతో రూపొందించాల్సి ఉంది. అయితే సంజయ్ దత్ నేరారోపణల కారణంగా జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయింది. మున్నాభాయ్ రెండు సినిమాలను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ పేర్లతో విడుదలైన రీమేక్ లు ఇక్కడా విజయం సాధించాయి. హిరాణీ కథ రెడీ చేస్తున్నారు కాబట్టి, శంకర్ దాదా ఫ్రాంఛైజీలో మూడో సినిమా కోసం చిరు సిద్ధమేనా? అన్నది వేచి చూడాలి.