Begin typing your search above and press return to search.

టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అవసరమే: ముర‌ళీమోహ‌న్

కానీ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌ ముర‌ళీమోహ‌న్‌ మాత్రం ప్రపంచ స్థాయి సినిమాలు రావాలంటే టికెట్‌ ధరలు, అదనపు షోలు ఉండాలని అభిప్రాయ పడుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2024 8:07 AM GMT
టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అవసరమే: ముర‌ళీమోహ‌న్
X

హీరో అల్లు అర్జున్ కేసు.. తదనంతరం ఇండస్ట్రీలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్‌ ప్రముఖులు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పని చేయడం గురించే ప్రధానంగా చర్చినట్లుగా ప్రకటించారు. ఇండస్ట్రీ గ్రోత్ ముఖ్యమని.. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు చిన్న పార్ట్ అని.. అదంత ఇంపార్టెంట్ కాదని దిల్ రాజు చెప్పారు. కానీ సీనియ‌ర్ న‌టుడు, నిర్మాత‌ ముర‌ళీమోహ‌న్‌ మాత్రం ప్రపంచ స్థాయి సినిమాలు రావాలంటే టికెట్‌ ధరలు, అదనపు షోలు ఉండాలని అభిప్రాయ పడుతున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమైన వారిలో ముర‌ళీమోహ‌న్‌ కూడా ఉన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం తరపు నుండి ఎలాంటి సహకారం ఉండాలనే దానిపై మురళీ మోహన్ మాట్లాడుతూ.. ''ఒకప్పుడు పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా లో బడ్జెట్‌ లోనే సినిమాలు తీసేవాళ్ళం. అప్పుడు తెలుగు రాష్ట్రంలో మాత్రమే మన సినిమాలు ఆడేవి. ఇతర రాష్ట్రాల్లో మన సినిమాలు ఎక్కడా ఆడేవి కాదు. అందుకే లిమిటెడ్ బడ్జెట్ లో సినిమాలు చేసాం. కానీ ఇవాళ తెలుగు సినిమా జాతీయ స్థాయిలోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. అనేక దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌ విపరీతంగా పెరుగుతోంది'' అని అన్నారు.

''పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీయాల్సి వస్తోంది. ఇతర దేశాల సినిమాలతో మన సినిమాలు కూడా పోటీగా నిలబడాలంటే, బాగా ఖర్చు పెట్టి తీయాలనే ఉద్దేశంతో బడ్జెట్ ఎక్కువ పెడుతున్నారు. సినిమా రిలీజైన మొదటి వారంలో ఎంత కలెక్షన్స్ వస్తాయో అదే మెయిన్. ఆ తర్వాత అంత ఎక్కువ వసూళ్లు రావు. అందుకే వారం రోజుల పాటు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అదనంగా ఎక్కువ షోలు వేసుకోడానికి అవకాశం కల్పించాలి. అప్పుడే ఫస్ట్ వీక్ లో మేజర్ కలెక్షన్స్ రాబట్టుకోడానికి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని సీఎంకు విన్నవించాం. అనేక ఇతర దేశాల్లో కూడా టికెట్ రేట్లు పెంచడం, షోల సంఖ్య పెంచడం అనేది ఉంది. అదే ఇక్కడ కొనసాగించాలని కోరితే, సానుకూలంగా స్పందించారు. 'సినీ ఇండస్ట్రీ తరపున ఓ కమిటీ ఏర్పాటు చేయండి. తరచూ కలుసుకుందాం. మినిస్టర్ తో, ఎఫ్డీసీ చైర్మన్ తో కూర్చొని మీరు డిసైడ్ చేయండి. ఆ తర్వాత నా దగ్గరకు వస్తే ఫైనల్ డెసిజన్ తీసుకుందాం' అని ముఖ్యమంత్రి చెప్పారు'' అని మురళీ మోహన్ చెప్పారు.

అలానే ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య కమ్యునికేషన్‌ గ్యాప్‌ ఏర్పడిందనే అంశం మీద మురళీ మోహన్ స్పందిస్తూ.. ''నేను ముఖ్యమంత్రికి ఓ విషయం విన్నపించాను. 'ఎలక్షన్ రిజల్ట్స్ రోజు పొలిటీషియన్స్ అందరూ మనం గెలుస్తామా లేదా, అధికారంలోకి వస్తామా రామా? అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తారు. అదే విధంగా సినిమా వాళ్లం కూడా కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన సందర్భంలో జనాల స్పందన తెలుసుకోడానికి ఫస్ట్ షోకి వెళ్తాము. ఎందుకంటే మార్నింగ్ షోకే సినిమా హిట్టా? ఫట్టా? అనేది ప్రజలు తేల్చేస్తారు' అని చెప్పాను. గతంలో మేం కూడా అలానే థియేటర్లకు వెళ్లేవాళ్లం. 'పుష్ప 2' షో చూడటానికి అల్లు అర్జున్‌ కూడా వెళ్లారు. దురదృష్టవశాత్తూ అనుకోకుండా అలాంటి ఇన్సిడెంట్ జరిగింది. ఓ మహిళ మృతి చెందడం, వాళ్ళ అబ్బాయి స్పృహ లేకుండా పడిపోవడం ఎవరూ ఊహించింది కాదు. దానికి సినీ ఇండస్ట్రీలో అందరం చింతిస్తున్నాం. ఫ్యూచర్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా మా సైడ్ నుంచి మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సహకారం కూడా అందజేస్తే ఇలాంటివి జరగకుండా చూస్తామని సీఎంకు విన్నవించాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. మీరూ మేమూ కలిసి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరక్కుండా చేయడానికి కృషి చేద్దామని చెప్పారు'' అని తెలిపారు.

ముర‌ళీమోహ‌న్‌ చెప్పినదాన్ని బట్టి చూస్తే సీఎంతో సమావేశంలో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల ప్రస్తావన వచ్చినట్లు అర్థమవుతోంది. 'సంక్రాంతి సినిమాలు.. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు టాపిక్ కాదు.. అవి అంత ఇంపార్టెంట్ కాదు' అని దిల్ రాజు చెప్పినప్పటికీ.. అవే చాలా ఇంపార్టెంట్ అని ముర‌ళీమోహ‌న్‌ అభిప్రాయ పడుతున్నారు. వరల్డ్ క్లాస్ సినిమాలు తీయాలంటే భారీగా ఖర్చు పెట్టాలని, దాన్ని రాబట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు ఉండాలని అంటున్నారు. కాకపోతే నిన్న మీటింగ్ లో ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని స్పష్టమవుతోంది. ఇటు ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ, అటు గవర్నమెంట్ నుంచి మరో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో రెండు వారాల్లో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి. మరి ఆలోపు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.