15 ఏళ్లు ఉంటే చాలనుకున్నా..కానీ 50 ఏళ్లు ఉన్నా!
మహా అయితే ఇంకా 15 ఏళ్లు సినిమాలు చేస్తాననుకున్నా. కానీ అదృష్టం కలిసి రావడం..చుట్టూ ఉన్న వారు సహకరించడంతో ఇన్నేళ్లగా పరిశ్రమలో కొనసాగుతున్నా.
By: Tupaki Desk | 20 Dec 2023 11:30 PM GMTప్రముఖ నటుడు మురళీ మోహన్ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. పరిశ్రమలో ఐదు దశాబ్ధాల ప్రయాణం ఆయన సొంతం. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. నాటి-మేటి హీరోలతోనూ తెరను పంచుకున్న నటుడాయన. ఎన్నో అవార్డులు -రివార్డులు సొంతం చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వేంటో ఆయన మాట్లోనే... 'నటుడిగా నాకు ఏఎన్నార్ స్పూర్తి. ఆయనలాగే చివరి శ్వాస ఉన్నంత వరకూ సినిమాల్లో నటిస్తూనే ఉంటా.
ఇన్నేళ్ల పాటు సినీ ప్రయాణం సాగిస్తానని అనుకోలేదు. నేను అనుకోకుండా నటుడినయ్యా. మొదటి సినిమా చేసినప్పుడు 33 ఏళ్ల వయసు. మహా అయితే ఇంకా 15 ఏళ్లు సినిమాలు చేస్తాననుకున్నా. కానీ అదృష్టం కలిసి రావడం..చుట్టూ ఉన్న వారు సహకరించడంతో ఇన్నేళ్లగా పరిశ్రమలో కొనసాగుతున్నా. మధ్యలో తప్పని పరిస్థితుల్లోకి రాజకీయాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. దాంతో పదేళ్లు సినిమాలకు బ్రేక్ ఏర్పడింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటాను.
మళ్లీ అటువైపు వెళ్లే ఆలోచన కూడా లేదు. ఇక సినిమాలకే నా జీవితం అంకితం. ఉన్నంత కాలం సినిమాలు చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తా. సినిమా ఇచ్చిన గుర్తింపుతోనే ఉండటం నాకెంతో సంతోషాన్నిస్తుంది. నేను కాస్త లేటుగా ఇండస్ట్రీకి వచ్చాను. అందువలన సాధ్యమైనంత వరకూ ఎక్కువ సినిమాలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్లాను. కృషి .. పట్టుదల .. క్రమశిక్షణ చాలా అవసరమని నేను భావిస్తాను.
ఎన్టీఆర్ - ఏఎన్నార్ లను చూసి మా తరం నేర్చుకుంది. షూటింగుకి ముందుగానే మేమంతా స్పాట్ లో రెడీగా ఉండేవాళ్లం .. లేదంటే నిర్మాత నష్టపోతాడు. మన వలన నిర్మాత నష్టపోకూ డదు అనే ఒక ఆలోచనతో పనిచేశాము. ఇప్పుడు ట్రాఫిక్ పెరిగిపోవడం వలన కొంతమంది షూటింగుకి రావడం ఆలస్యమవుతూ ఉండొచ్చు. అది వేరే విషయం. మా కంటే .. ఇప్పటి హీరోలు ఎక్కువ కష్టప డుతున్నారు. డాన్సులు .. ఫైట్ల కోసం వాళ్లు ఎక్కువ కసరత్తులు చేస్తున్నారు. అలాగే డైరెక్షన్ .. ఫొటోగ్రఫీ .. మ్యూజిక్ విషయంలో టెక్నికల్ గా ఎన్నో మార్పులు వచ్చాయి. తెలుగు సినిమా స్థాయి మారింది. బాలీవుడ్ వాళ్లంతా ఇక్కడి సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిని చూపిస్తారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది' అని అన్నారు.