మర్డర్ కేసులో అతడికి వ్యతిరేకంగా నటీ ఏం చేసిందంటే?
సంచలనమైన రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2024 9:21 AM GMTసంచలనమైన రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దర్శన్ తో పాటు పవిత్రా గౌడ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరితో పాటు మరో పది మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ప్రధాన నిందుతులుగా దర్శన్, పవిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరికీ శిక్ష తప్పదని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో హత్య కేసులో ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష గానీ, జీవిత ఖైదు విధించాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలాంటి విషయాల్లో నెటి జనుల నుంచి ఇలాంటి రియాక్షన్ ఊహించినదే. అయితే ఆ ట్వీట్ ను కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన రీ ట్వీట్ చేయడం సంచలన మవుతోంది. ఎంతో మంది సెలబ్రిటీలున్నా ఎవరూ ఈ కేసు విషయంలో స్పందించలేదు.
కానీ రమ్య మాత్రం ఆ నెటి జనుడి ట్వీట్ ని రీట్వీట్ ఎందుకు చేసినట్లు? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వైరం తెరపైకి వస్తోంది. గత ఎన్నికల్లో రమ్య కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయింది. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దర్శన్ పనిచేసాడు. దీంతో ఆ రాజకీయ కక్షతోనే ఇలా రీ ట్వీట్ కొట్టి ఉంటుందని కొందరు భావిస్తున్నారు.
మరికొంత మంది ఇద్దరి మధ్య కన్నడ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వివాదాలున్నాయని, అవి ఇప్పుడు ఈ హత్య కేసు కారణంగా బయట పడుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా దర్శన్ హత్య చేసినట్లు రమ్య బలంగా నమ్ముతుందని ఆమె రీ ట్వీట్ తో తెలుస్తుంది. కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తులో మాత్రమే దర్శన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.