టీజర్ టాక్: 50 వయసులో DJ అయ్యేదెలా మూర్తి గారు?
నవ్యపంథా కథలు.. వైవిధ్యమైన కథనం.. సెన్సిటివ్ టాపిక్స్ తో సినిమాలను తెరకెక్కిస్తే ప్రజల నుంచి చక్కని ఆదరణ దక్కుతోంది
By: Tupaki Desk | 21 April 2024 8:10 AM GMTనవ్యపంథా కథలు.. వైవిధ్యమైన కథనం.. సెన్సిటివ్ టాపిక్స్ తో సినిమాలను తెరకెక్కిస్తే ప్రజల నుంచి చక్కని ఆదరణ దక్కుతోంది. ఇటీవలి కాలంలో నేచురలిస్టిక్ ఫన్ ఎలివేటెడ్ కామెడీ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా నిర్మాత హర్ష గారపాటి రూపొందించిన 'మ్యూజిక్ షాప్ మూర్తి' ఇదే తరహా ప్రయత్నమని అర్థమవుతోంది. తెలుగమ్మాయి చాందినీ చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అజయ్ ఘోష్ టైటిల్ పాత్రలో నటించారు. ఈ చిత్రం అందమైన కామెడీ, సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా వస్తోంది.
తాజాగా రిలీజైన టీజర్ ఆద్యంతం ఎంతో ఆహ్లాదంగా ఆకట్టుకుంది. అజయ్ ఘోష్ పాత్ర పేరు మూర్తి. DJగా తనకంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలని కలలు కనేవాడిగా కనిపిస్తాడు. దీనికోసం ఎలాగైనా హైదరాబాద్ వెళ్లాలనేది అతడి తపన. కానీ అనేక సవాళ్లతో సతమతమవుతూ.. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. మ్యూజిక్ కంపెనీ వ్యాపారం సతాయిస్తున్నా.. తన సంకల్పం ముందు అతడు తలవొంచలేదు. చాందిని చౌదరి పాత్ర మూర్తికి సహకారిగా ఉంటుంది. అయితే మూర్తి ప్రయాణంలో ఒక ఆసక్తికర ఎలిమెంట్ ఉంది. అది అతడి వయసు.. 50 ఏళ్ల వయసులో DJ కావాలనే తన కలను నెరవేర్చుకోవడానికి మూర్తి ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు? తన చుట్టూ ఉన్న సమాజానికి అతడు తలొంచాడా? అనేది తెరపైనే చూడాలి. తీవ్ర భావోద్వేగాలు, ఉత్తేజపరిచే నేపథ్య సంగీతం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ.. వాస్తవ సమస్యను ప్రతిధ్వనించే డైలాగ్‌లతో టీజర్ ఆద్యంతం రక్తి కట్టించింది.
'మ్యూజిక్ షాప్ మూర్తి'లో ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కథనాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్ష గారపాటి ఈ చిత్రానికి నిర్మాత. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై, దర్శకుడు శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించాడు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ ప్రధాన అస్సెట్ కానున్నాయి.
అసాధారణమైన కథాంశం, ప్రతిభావంతులైన తారాగణం, ఉత్తమ సాంకేతిక నిపుణుల కలయికతో ఈ చిత్రం ప్రేక్షకులను మూర్తి ప్రపంచంలోని మరపురాని ప్రయాణంలో తీసుకెళుతుంది.