ఆ స్టార్ హీరోపై విమర్శలు సరికాదు
గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కంగువా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 14 Dec 2024 2:30 PM GMTగత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కంగువా' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని మూట కట్టుకున్న విషయం తెల్సిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లాప్ జాబితాలో కంగువా చేరింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కంగువా సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించిన విషయం తెల్సిందే. దాదాపు రూ.400 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన కంగువా సినిమా అందులో కనీసం సగం వసూళ్లు రాబట్టలేక పోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్‌గా కంగువా నిలిచింది. వసూళ్ల పరంగా నిరాశను మిగల్చడం మాత్రమే కాకుండా దర్శకుడు శివ, హీరో సూర్యపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
కంగువా సినిమా విమర్శలపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కంగువా సినిమాపై వస్తున్న విమర్శలను తప్పుబడుతున్నారు. ప్రేక్షకులను మెప్పించడం కోసం చేసిన ప్రయత్నంను ఎందుకు అవహేళన చేస్తున్నారు అంటూ కొందరు సూర్య, శివలకు మద్దతు తెలిపితే కొందరు మాత్రం ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలను ఆధరించకున్నా పర్వాలేదు విమర్శలు చేయకుండా ఉండాలని కోరుతున్నారు. ఇదే సమయంలో ప్రముఖ దర్శకుడు మిస్కిన్ ఒక సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సూర్య, శివలపై జరుగుతున్న ట్రోల్స్‌పై దర్శకుడు మిస్కిన్ మాట్లాడుతూ.. సూర్య మంచి నటుడు, ఆయన్ను ఇంతగా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు. శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుడితో కలిసి నటించిన శివ కుమార్ కుమారుడు సూర్య. అందుకే ఆయన్ను గౌరవించడం మన యొక్క బాధ్యత. శివాజీ గణేశన్ గారు మన మధ్య లేరు, వారితో కలిసి నటించిన శివ కుమార్ గారు ఇప్పటికీ ఉన్నారు. ప్రజలు ఆయనను కచ్చితంగా గౌరవించాలి, ఆయన కుటుంబానికి తగిన గౌరవ మర్యాదలను ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మిస్కిన్ అన్నారు.
ఒక శాస్త్రవేత్త తన జీవితంలో 10 ఏళ్లు కష్టపడి ఒక రాకెట్‌ను తయారు చేస్తే చివరి నిమిషంలో చిన్న విద్యుత్ కనెక్షన్ లోపంతో రాకేట్ పేలిపోయేలా చేస్తుంది. అది శాస్త్రవేత్త తప్పు ఎలా అవుతుంది. ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన్ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆయన గురించి విమర్శించడం మానేసి ఆయన చేసిన ప్రయత్నంను అభినందించాల్సింది పోయి విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మిస్కిన్ ప్రశ్నించారు. కంగువా టీంను సైతం విమర్శించకుండా ఆయనకు బాసటగా నిలవాల్సిన సమయం ఇది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.