జై హనుమాన్ : మైత్రి వారిపై మరో ఫిర్యాదు
మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై హనుమాన్' సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 9 Jan 2025 4:33 AM GMTపుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో హీరో, థియేటర్ యాజమాన్యంతో పాటు నిర్మాతలపైనా కేసు నమోదు అయ్యింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అయిన నవీన్ యెర్నేని, రవి శంకర్‌లపై తొక్కిసలాట కేసు నమోదు కావడంతో పాటు అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. అయితే కోర్టు నుంచి అరెస్ట్‌పై స్టే తెచ్చుకున్నారు. దాంతో తృటిలో జైలుకు వెళ్లడం తప్పించుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 కేసు నుంచి ఇంకా పూర్తిగా బయట పడలేదు. ఈ సమయంలోనే నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాది తిరుమలరావు ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేశాడు.
మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నారు. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'జై హనుమాన్' సినిమా ఒకటి అనే విషయం తెల్సిందే. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాకు సీక్వెల్‌గా జై హనుమాన్ రూపొందుతోంది. ఇటీవలే జై హనుమాన్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆ మధ్య సినిమాలో ఆంజనేయుడి పాత్రను కన్నడ స్టార్ హీరో కాంతార స్టార్ రిషబ్ శెట్టి పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా రిషబ్ శెట్టిని ఆంజనేయుడి గెటప్‌లో చూపించారు. రిషబ్ అద్భుతంగా ఆంజనేయుడి గెటప్‌లో సెట్ అయ్యారంటూ ప్రశంసలు దక్కాయి.
జై హనుమాన్‌లో ఆంజనేయుడిగా రిషబ్ శెట్టిని చూపించడంపై తిరుమలరావు ఫిర్యాదు చేశారు. రిషబ్ శెట్టిని ఆంజనేయుడిగా చూపిస్తే భవిష్యత్తులో ఆంజనేయుడి గుర్తించడం సమస్యగా మారుతుంది. అంతే కాకుండా సినిమాలో ఆంజనేయుడిని అవమానిస్తూ కొన్ని సన్నివేశాలు ఉంటాయనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంజనేయుడు ఎవరు అంటే రాబోయే తరాల వారు అసలు గుర్తించే అవకాశం ఉండదు. అది హిందూ ధర్మంపై దాడి అంటూ న్యాయవాది తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. ఆంజనేయుడి పాత్రతో సినిమాను చేయవద్దని ఆదేశించాలని కోర్టును అడ్వకేట్ విజ్ఞప్తి చేశాడు.
ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ లేదా ఇతర యూనిట్ సభ్యులు ఎవరూ స్పందించలేదు. కోర్టులో ఈ ఫిర్యాదుపై ఎలాంటి వాదనలు వినిపిస్తారు అనేది చూడాలి. గతంలో ఎంతో మంది ఆంజనేయుడి పై సినిమాలు తీశారు, ఎంతో మంది ఆంజనేయుడి గెటప్‌లో కనిపించారు. ఇన్నాళ్లు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు అంటూ కొందరు విమర్శిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ సినిమా వారిపై ఫిర్యాదు చేయడం ఈ మధ్య కామన్ అయ్యిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జై హనుమాన్ సినిమా ప్రారంభ దశలో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కచ్చితంగా ఇబ్బందికర విషయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఏం జరుగుతుందో చూడాలి.