Begin typing your search above and press return to search.

అరుదైన గుర్తింపు దక్కించుకున్న 'మైత్రీ మూవీ మేకర్స్'

ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి గాను ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   10 July 2024 1:16 PM GMT
అరుదైన గుర్తింపు దక్కించుకున్న మైత్రీ మూవీ మేకర్స్
X

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'మైత్రీ మూవీ మేకర్స్' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ బ్యానర్.. ఓవైపు స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు మీడియం రేంజ్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను సినీ అభిమానులకు అందిస్తోంది. అయితే తాజాగా మైత్రీ మేకర్స్ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. FC-Ormax 2024 పవర్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.

ఫిల్మ్ కంపేనియన్ - ఓర్మాక్స్ (FC-Ormax) సంస్థలు కలిసి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని నడిపించే పవర్ హౌస్ లను గుర్తించడానికి ప్రతీ ఏడాది ఓ జాబితాను విడుదల చేస్తుంది. ఎప్పటిలాగే 2024 సంవత్సరానికి గాను ప్రొడక్షన్ హౌస్‌ల పవర్ లిస్ట్‌ను తాజాగా ప్రకటించింది. ఇందులో 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్ కు చోటు కల్పించింది. ఈ పవర్ లిస్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు ప్రొడక్షన్ హౌస్ ఇదే కావడం విశేషం.

2015లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాతో నిర్మాణంలో అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. వెంటనే 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకుని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా అవతరించింది. దీంతో అనతి కాలంలోనే నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరిలు అగ్ర నిర్మాతలుగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2019లో మోహన్ బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి నవీన్, రవిశంకర్ లు నిర్మాణ బాధ్యతలు చూసుకుంటూ.. తమ బ్యానర్ ను భారతదేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటిగా నిలిపారు.

మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గడిచిన 9 ఏళ్లలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ లు యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు. 2023 సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' & 'వీరసింహా రెడ్డి' లాంటి రెండు పెద్ద సినిమాలను ఒకేసారి విడుదల చేసే సాహసం చెయ్యడమే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణలతో కలిసి కమర్షియల్ సక్సెస్ సాధించారు.

మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలో రెండు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీస్ ఉన్నాయి. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులలో 'ఉప్పెన' బెస్ట్ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ సాధించింది. 'పుష్ప' చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ నేషనల్ ఫిలిం అవార్డులు అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని సీక్వెల్ 'పుష్ప 2' కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తెలుగులోనే కాకుండా, ఇతర భాషలలో కూడా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'నడికర్' చిత్రంతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మలయాళ పరిశ్రమలోకి ప్రవేశించింది. ప్రస్తుతం అజిత్ కుమార్ తో తీస్తున్న 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ఇదే క్రమంలో హిందీ యాక్టర్ సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

రానున్న రోజుల్లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ సినిమా రానుంది. అలానే రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు వంటి ఆసక్తికరమైన కాంబినేషన్‌లలో క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారు. వీటితో పాటుగా విజయ్ దేవరకొండతో 'VD 14'.. నితిన్ తో 'రాబిన్ హుడ్' లాంటి మరికొన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్‌కి FC-Ormaxలో చోటు దక్కడం మరో పెద్ద గుర్తింపు అనే చెప్పాలి.