Begin typing your search above and press return to search.

మ‌నం 50 కోట్ల‌తో తీసేది వాళ్లు 25 కోట్ల‌లోనే

రవిశంకర్‌ మాట్లాడుతూ.. ''మనం 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, మలయాళ నిర్మాతలు అదే సినిమాను కేవలం 25 కోట్లతో తీస్తారు

By:  Tupaki Desk   |   23 March 2024 4:59 AM GMT
మ‌నం 50 కోట్ల‌తో తీసేది వాళ్లు 25 కోట్ల‌లోనే
X

తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో అదుపు త‌ప్పుతున్న‌ బ‌డ్జెట్ల‌ గురించి నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. హీరో- ద‌ర్శ‌కుల పారితోషికాలే బ‌డ్జెట్లో స‌గం భారంగా మారుతున్నాయ‌న్న ఆవేద‌న ఉంది. సాంకేతిక నిపుణుల‌కు కూడా భారీ మొత్తాల‌ను అంద‌జేయాల్సి ఉంటుంది. ఈ విష‌యంపై ద‌ర్శ‌క‌ర‌త్నకీ.శే.దాస‌రి నారాయ‌ణ‌రావు చాలా సార్లు వేదిక‌ల‌పై త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. చాలా మంది సినీపెద్ద‌లు తాము ప‌రిశ్ర‌మ నుంచి వైదొల‌గడానికి కార‌ణం అదుపు త‌ప్పిన బ‌డ్జెట్లు మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ అని బ‌హిరంగ వేదిక‌ల‌పై చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్ర‌ముఖ టాలీవుడ్ అగ్ర‌నిర్మాత చేసిన ఓ కామెంట్ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌గా మారింది. మ‌న‌కంటే స‌గం బ‌డ్జెట్ లోనే అంతే క్వాలిటీతో సినిమాలు తీసే ప‌రిశ్ర‌మ మాలీవుడ్ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించిన తాజా చిత్రం 'ది గోట్ లైఫ్' తెలుగు వెర్ష‌న్ ని మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత‌లు రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ లో జ‌రిగిన‌ ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైన మైత్రి రవిశంకర్ మాలీవుడ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రవిశంకర్‌ మాట్లాడుతూ.. ''మనం 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, మలయాళ నిర్మాతలు అదే సినిమాను కేవలం 25 కోట్లతో తీస్తారు. ఇంకా నాణ్య‌త‌ అలాగే ఉంది. అది మలయాళీ టెక్నీషియన్ల అందం. ఈ సినిమా కోసం టీమ్ 80 కోట్లు వెచ్చించింది.. కానీ క్వాలిటీ చూస్తుంటే 100 కోట్ల బడ్జెట్ సినిమా అని తెలుస్తోంది'' అంటూ వ్యాఖ్యానించారు. ''సాంకేతిక విలువలు, లొకేషన్లు, సౌండ్ మిక్సింగ్, విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు బ్లెస్సీ 16 ఏళ్ల పాటు కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించడం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించింది. కనీసం అతడి కోస‌మైనా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్‌ కావాలి'' అని అన్నారు. ఈ సినిమా 2024 మార్చి 28న విడుదలవుతోంది. నిజానికి మైత్రి అధినేత వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి.. మ‌న హీరోలు, సాంకేతిక నిపుణుల పారితోషికాల హైప్ గురించిన ఆందోళ‌న‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.