తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకపోతే మంచిది!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ ను మన ఖర్మ, ఏమీ చేయలేం అని పోస్ట్ ఎందుకు పెట్టారని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.
By: Tupaki Desk | 19 March 2025 11:18 AM ISTతెలంగాణ ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న నాలుగు వందల ఎకరాల విషయంలో మన ఖర్మ అంటూ ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గతంలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో ఆయన మాట్లాడారు. ఎవడే సుబ్రమణ్యం సినిమా రిలీజై పదేళ్లవుతున్న సందర్భంగా దాన్ని మార్చి 21న రీరిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగ్ అశ్విన్ ను మన ఖర్మ, ఏమీ చేయలేం అని పోస్ట్ ఎందుకు పెట్టారని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి నాగి, నాలుగు వందల ఎకరాల్లో ఉన్న చెట్లు కొట్టేస్తారనే ఉద్దేశంతో తాను ఆ పోస్ట్ పెట్టానని, అది తీసేయాలని చెప్పారు. ప్రకృతిని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలనే ఆలోచనతో తను ఆ పోస్ట్ పెట్టినట్టు ఆయన తెలిపారు.
డెవలప్‌మెంట్ కోసమే ఆ పని చేస్తున్నప్పటికీ, చెట్లు కొట్టేయడమనేది కరెక్ట్ కాదని తాను భావిస్తున్నానని, నిజంగా డెవలప్ చేయాలనుకుంటే టైర్2 సిటీస్‌పై దృష్టి పెట్టొచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినా ఆ ఏరియాలో ఎన్నో ఐటీ పార్కులున్నాయని, తనకు తెలిసి వాటిలో సగం ఖాళీగానే ఉన్నాయని, ఆ ఖాళీ స్పేస్ ను వాడుకుని ఈ చెట్లను నరికేయకుండా ఉంటే మంచిదని, కుదిరితే ఆ భూములను కాపాడేందుకు మీడియా కూడా ప్రయత్నిస్తే బావుంటుందని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
విషయంలోకి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం అమ్మేస్తుందనే వార్తలపై నాగి ఈ పోస్ట్ చేశారు. ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న భూమి గ్రీన్ జోన్ ఏరియా అని, అక్కడ ఎన్నో అరుదైన వన్య ప్రాణులు, పక్షి జాతులు నివాసమున్నాయని దాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదని ఆయన భావిస్తున్నారు.
డెవలప్‌మెంట్ కోసం ఈ 400 ఎకరాల ల్యాండ్ ను అమ్మేద్దామని ప్రభుత్వం చూస్తున్నప్పటికీ, దాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కూడా ఓపెన్ గా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా నాగ్ అశ్విన్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు.