నాగ చైతన్య ప్రతి సారీ నిరాశపడేది ఇందుకే
రిలీజ్ డేట్ ప్రకటించి సినిమా పూర్తి చేస్తే అది వందశాతం సంతృప్తి పరచదనే ఆవేదన చైతూ మాటల్లో వినిపించింది.
By: Tupaki Desk | 6 Nov 2024 1:27 PM GMTనటుడిగా నాగచైతన్య రోజురోజుకి షైన్ అవుతున్నాడు. సినిమా సినిమాకి బెటర్ మెంట్ కనిపిస్తోంది. కథలు, స్క్రిప్టుల ఎంపికలోను చైతన్య పరిణతి ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవలి విజయాలు నిరూపించాయి. టైమ్ తీస్కున్నా ప్రతిదీ పక్కాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు చైతూ. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది చైతూ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 బ్యానర్ లో బన్ని వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే తన కెరీర్ లో అత్యంత సంతృప్తికరంగా చేసిన సినిమా ఇదని నాగచైతన్య అన్నారు. రిలీజ్ డేట్ ముందే చెప్పి డెడ్ లైన్ కోసం సినిమా చేయడం తనకు ఎప్పుడూ నచ్చదని 'తండేల్' తాజా ప్రచార వేదికపై వ్యాఖ్యానించారు. ఈసారి తండేల్ చిత్రీకరణ విషయంలో నిర్మాతలు అల్లు అరవింద్- బన్ని వాసు రాజీకి రాలేదు. నేను తొలి కాపీ చూశాకే, రిలీజ్ డేట్ ప్రకటిస్తానని అల్లు అరవింద్ మాటిచ్చారని, ఆ మాట తనను చాలా ఉత్సాహపరిచిందని చైతూ అన్నారు. తన నిర్మాతల నుంచి భరోసా తనకు చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు.
రిలీజ్ డేట్ ప్రకటించి సినిమా పూర్తి చేస్తే అది వందశాతం సంతృప్తి పరచదనే ఆవేదన చైతూ మాటల్లో వినిపించింది. అలా డెడ్ లైన్లు పెట్టుకోకుండా తండేల్ సినిమాని తాపీగా పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొడతానని నాగచైతన్య కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. చందు మొండేటి పనితనంపైనా ప్రశంసలు కురిపిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో అత్యంత భారీ చిత్రమిదని కూడా చైతూ అన్నారు.
అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో చందూ మొండేటి దర్శకత్వం వహించిన 'తండేల్' యాక్షన్-ప్యాక్డ్ డ్రామాతో తెరకెక్కింది. 7 ఫిబ్రవరి 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి వస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకార యువకుడిగా ఛాలెంజింగ్ పాత్రలో నటించాడు. తీర ప్రాంత ప్రజల కఠినమైన జీవితాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఇందులో మత్స్యకారుల పాత్రలు నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది తీర్చిదిద్దారు. భారతదేశ తీరప్రాంతాల వెంబడి నివసించే వారి జీవన్మరణ పోరాటాలను తెరపైకి తెస్తున్నారు. పాకిస్తాన్ జైలులో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన నిజమైన మత్స్యకారుడి కథతో తెరకెక్కించామని చిత్రబృందం చెబుతోంది. లవ్ స్టోరి తర్వాత నాగచైతన్య- సాయిపల్లవికి రెండో చిత్రమిది.