నా ఇంట్లో వైజాగ్ పీస్ అంటూ సెంటిమెంట్ రాజేసిన చై
ఓవైపు సినిమాలతో బిజీగా ఉండగానే, మరోవైపు పెళ్లి ప్రయత్నాలు, ఏర్పాట్లు పూర్తి చేయడం అంటే ఆషామాషీనా? ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉంటుంది
By: Tupaki Desk | 4 Feb 2025 5:20 PM GMTఓవైపు సినిమాలతో బిజీగా ఉండగానే, మరోవైపు పెళ్లి ప్రయత్నాలు, ఏర్పాట్లు పూర్తి చేయడం అంటే ఆషామాషీనా? ప్రతిదీ ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక భారీ ప్రణాళికలో తన భార్య శోభిత ధూళిపాల చేసిన సహాయం గురించి అక్కినేని నాగచైతన్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. శోభితకు సాంప్రదాయంపై ఉన్న ఆసక్తి గురించి, పర్ఫెక్ట్ పెళ్లి కోసం ఎలాంటి ప్లానింగ్ చేసిందో చెబుతూ ప్రశంసలు కురిపించాడు.
నాగ చైతన్య - శోభిత ధూళిపాల 4 డిసెంబర్ 2024న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి తెలుగు సాంప్రదాయంలో ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు చై `తండేల్` చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత కూల్ గా తండేల్ విడుదల ప్రమోషన్స్ లో అన్ని విషయాలు ఓపెనవుతున్నాడు. ప్రధానంగా, తన భార్య శోభిత ప్లానింగ్ అతడికి బాగా నచ్చిన అంశం.
తన వివాహం గురించి చైతూ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇదంతా ఆనందకరంగా జరగడంలో శోభితకే క్రెడిట్ ఇవ్వాలని చైతన్య అన్నాడు. పెళ్లికి సంబంధించిన అన్ని ప్రణాళికలను శోభిత స్వయంగా చూసుకున్నారని అన్నారు. మన అందమైన సంస్కృతిని శోభిత ప్రేమిస్తుంది. నేటివిటీని ప్రేమిస్తుంది. ప్రతిదీ డీటెయిల్డ్ గా డిజైన్ చేయడం తన ప్రత్యేకత. మొత్తం కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి అద్భుతంగా జరిగింది.. ఈ క్రెడిట్ శోభితకే! అని చైతూ అన్నారు.
వైజాగ్ అమ్మయి (అమ్మాయి)ని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకున్నాను అంటూ చైతన్య విశాఖ-నార్త్ ఆంధ్రా ప్రమోషన్స్ లో సెంటిమెంట్ ని రాజేసాడు. ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ పీస్ ఉంది. కాబట్టి సోదరులారా నా రెక్వస్ట్ ఏమిటంటే, వైజాగ్‌లో థండేల్ బాక్సాఫీస్ కలెక్షన్ అద్భుతంగా ఉండాలి.. లేకపోతే నేను అత్త ఇంట్లో గౌరవాన్ని కోల్పోతాను అని అన్నాడు. థండేల్ 7 ఫిబ్రవరి 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. బన్ని వాసు- అల్లు అరవింద్ నిర్మించారు.