పెళ్లి పిల్లలపై నాగచైతన్య ఉద్దేశం
నాగ చైతన్య తండ్రి నాగార్జున ఈ జంటతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి ఎక్స్ లో శుభవార్తను ప్రకటించారు.
By: Tupaki Desk | 15 Nov 2024 3:17 PM GMTనాగచైతన్య- శోభిత జంట ప్రేమాయణం ఫలవంతం అవుతున్న తరుణమిది. ఇరువైపులా పెద్దల అంగీకారంతో ఈ జంట ఒకటి కానున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని కథనాలొస్తున్నాయి. అయితే ఇప్పటికి ఈ జంట అధికారికంగా ఎలాంటి తేదీని ధృవీకరించలేదు. ఈ ఏడాది ఆగస్టు 8న చై- శోభిత ఉంగరాలు మార్చుకున్నారు. నాగ చైతన్య తండ్రి నాగార్జున ఈ జంటతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి ఎక్స్ లో శుభవార్తను ప్రకటించారు.
గత నెల శోభితా ధూళిపాళ విశాఖపట్నంలో తన వివాహ వేడుకల ప్రారంభానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. గోధుమ రాయి, పసుపు దంచటం వేడుక నుండి ఫోటోలను కూడా షేర్ చేసారు. పెళ్లికి డేట్ దగ్గరపడే కొద్దీ అక్కినేని- ధూళిపాల కుటుంబాల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ప్రస్తుతం షాపింగులు వగైరా పూర్తవుతున్నాయి.
ఇంతలోనే పెళ్లి, పిల్లల్ని కనడం గురించి నాగచైతన్య ఓపెనయ్యాడు. శోభిత ధూళిపాళతో పెళ్లికి ముందు నాగ చైతన్య తన కుటుంబ జీవితం గురించి బహిరంగంగా చర్చించాడు. మంగళవారం నాడు రానా దగ్గుబాటి తన ఎక్స్ ఖాతాలో కొత్త చాట్ షోను ప్రకటించారు. దగ్గుబాటి రానా షేర్ చేసిన ప్రోమో రానా టాక్ షోలో పాల్గొనే నటీనటులను వెల్లడించింది. మిగతా సెలబ్రిటీలతో పాటు నాగ చైతన్య కూడా ఈ షోకి రానున్నారు. ప్రోమోలో చైతన్యతో రానా సంభాషణలు ఉత్కంఠను పెంచాయి. ``మీ కుటుంబం ఎలా ఉండాలని ఊహిస్తారు? అని నాగ చైతన్యను రానా ప్రశ్నించాడు. ``పెళ్లి చేసుకోవడం సంతోషం.. పిల్లలతో దంపతులు..`` అని షార్ట్ అండ్ స్వీట్ గా సమాధానమిచ్చాడు. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పైనా సీరియస్ గా ఉన్నాడు. చందు మొండేటితో `తండేల్` అనే చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని కలలుగంటున్నాడు.