అక్కినేని కుర్రోడు 15 ఏళ్ల కెరీర్ జర్నీ
ఏఎన్నార్, నాగార్జున లాంటి దిగ్గజ నటుల లెగసీని ముందుకు నడిపిస్తూ ఇటీవల నాగచైతన్య వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Sep 2024 4:25 PM GMTఏఎన్నార్, నాగార్జున లాంటి దిగ్గజ నటుల లెగసీని ముందుకు నడిపిస్తూ ఇటీవల నాగచైతన్య వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని వారసత్వంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ నాగచైతన్య. అతడు సినీ పరిశ్రమలో తన 15వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా చైతూ అగ్రెస్సివ్ లుక్ తో ఉన్న డీపీని విడుదల చేయడం ఆసక్తికరం. చై ప్రయాణం 2009 చిత్రం `జోష్`తో ప్రారంభమైంది. కెరీర్ జర్నీలో తనవైన విలక్షణ ఎంపికలు, అద్భుత నటనతో చైతూ ప్రేక్షకులను ఆకర్షించాడు.
సినీ కుటుంబం నుంచి వారసుడిగా వచ్చిన నాగ చైతన్య కుటుంబ లెగసీని నిలబెట్టడమే కాకుండా తన పరిధిని విస్తరించుకుంటున్న తీరు ఆసక్తికరం. చేసే పనిలో అంకితభావం- నిబద్ధత.. డౌన్-టు-ఎర్త్ వ్యక్తిత్వంతో అతడికి అభిమానులు అసాధారణంగా పెరిగారు. కెరీర్‌లో ఏ మాయ చేసావే -100 పర్సంట్ లవ్ -మజిలీ-లవ్ స్టోరీ-బంగార్రాజు-వెంకీ మామ వంటి అనేక విమర్శకుల ప్రశంసలు పొందిన, వాణిజ్యపరంగా విజయవంతమైన చిత్రాలను అందించాడు. అతడు అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చడ్డాలో నటించి బాలీవుడ్ మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఇప్పుడు తండేల్‌తో పాన్-ఇండియన్ స్టార్ గా తనను తాను ఆవిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు.
పరిశ్రమలో 15 ఏళ్ల మైలురాయిని సెలబ్రేట్ చేసుకోవడానికి `తండేల్` టీమ్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఇందులో చైతూ ఒక మత్స్యకారుడిగా కనిపిస్తున్నాడు. తీరంలో వేచి ఉన్న బోట్‌లో దూకుడున్న కుర్రాడిలా నిలబడి స్మైల్ ఇస్తూ కనిపించాడు. చైతూ లుక్ వైజ్ మేకోవర్ కోసం ప్రయత్నించిన తీరు ఆకట్టుకుంటోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక తీర ప్రాంత గ్రామం నేపథ్యంలో సాగే ఈ చిత్రం నిజ జీవిత కథతో రూపొందుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
`తండేల్` నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. అతడికి చిరస్మరణీయమైన విజయాన్ని అందించడానికి మేకర్స్ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగ చైతన్య ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. లుక్ పరంగా అవసరం మేర పరివర్తనను సాధించాడు. ఒక రియల్ మత్స్యకారుడిగా డిక్షన్ - బాడీ లాంగ్వేజ్‌ని సరిగ్గా పొందడానికి చాలా కష్టపడ్డాడు. నాగ చైతన్య కెరీర్ 15వ ఏట సరికొత్త మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు `తండేల్` తనకు మరో చిరస్మరణీయ విజయంగా మారుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.
ఓటీటీ రంగంలో..
హర్రర్ థ్రిల్లర్ `ధూత`తో చైతన్య OTT రంగంలోకి అడుగుపెట్టాడు. దేశవ్యాప్తంగా అతడి నటనకు ప్రశంసలు అందుకున్నాడు. నాగ చైతన్య తన ఆన్-స్క్రీన్ చరిష్మా తో అలరించడమే కాదు.. ఖరీదైన స్పోర్ట్స్ కార్ ల సేకరణతోను నిరంతరం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చైతన్య తన విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబించే అత్యాధునిక కార్లతో తన గ్యారేజీని నింపాడు.