నా కెరీర్లో తండేల్ ఓ మైల్ స్టోన్ మూవీగా నిలుస్తోంది: నాగ చైతన్య
మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా తెరకెక్కిన తండేల్ కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై మంచి బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుంది.
By: Tupaki Desk | 5 Feb 2025 2:02 PM GMTఅక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా తండేల్. అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు పెంచిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా తెరకెక్కిన తండేల్ కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై మంచి బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుంది.
ఈ సందర్భంగా నాగ చైతన్య మీడియాతో తండేల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ లో చేయాలని ఎప్పట్నుంచో అనుకున్నప్పటికీ పదేళ్ల తర్వాత వారితో కలిసి పని చేయడం వల్ల తానెంతో నేర్చుకున్నానని చైతన్య చెప్పాడు. తాను ఆల్రెడీ సినిమా చూశానని, అందుకే సినిమా భారీ విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్తున్నట్టు తెలిపాడు. తన కెరీర్లోనే తండేల్ బిగ్గెస్ట్ సినిమా అవుతుందని చైతూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
బన్నీ వాసు క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తండేల్ కోసం ఖర్చు పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పిన చైతన్య, కథ కరెక్ట్ మూడ్ లో ఉండాలని గంటల తరబడి సముద్రం మధ్యలో షూటింగ్ చేసి ఎంతో కష్టపడినట్టు చెప్పాడు. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ పనితనం తనకెంతో నచ్చిందని మళ్లీ మళ్లీ అతనితో పని చేయాలని కోరుకుంటున్నట్టు చైతూ పేర్కొన్నాడు.
సంగీతం విషయంలో దేవీ శ్రీ ప్రసాద్ ను మెచ్చుకున్న చైతన్య, బుజ్జితల్లి పాటతో దేవీ తండేల్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడన్నాడు. ఇక హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ, పల్లవి లాంటి డెడికేషన్ ఉన్న హీరోయిన్ తో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుందని, ఆమె ఎనర్జీతో ఈ సినిమా మరింత స్పెషల్ గా మారిందన్నాడు.
తనకు సినిమా స్క్రిప్ట్ బాగా నచ్చిందని, ఇది రియల్ స్టోరీ అని తెలియగానే సినిమా చేయాలని ఎంతో ఎగ్జైట్ అయినట్టు చెప్పిన చైతూ, శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్య్సకారులతో మాట్లాడి అంతా తెలుసుకుని, తండేల్ రాజుగా తనను తాను మార్చుకోవడానికి 8 నెలల పాటూ కష్టపడ్డానని వెల్లడించాడు. తండేల్ సినిమా చూశాక ఆడియన్స్‌కు ఓ ఎమోషనల్ హై దక్కుతుందని, సినిమాలోని ఎమోషన్స్ కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని చైతూ తెలిపాడు.
తండేల్ పెద్ద హిట్ అవాలని కోరుకుంటున్నానని, ఈ సినిమా తన కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలుస్తుందనుకుంటున్నానని చైతూ ఈ సందర్భంగా అన్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ సినిమా యదార్థ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పించగా బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించాడు.