తండేల్ : రియల్ స్టోరీని డామినేట్ చేసిన రీల్ స్టోరీ
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'తండేల్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 7 Feb 2025 9:30 PM GMTనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన 'తండేల్' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్‌ల చేతికి చిక్కి, అక్కడి జైల్లో పడి దాదాపు రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన ఇతివృత్తం తీసుకుని ప్రేమకథను జోడించి దర్శకుడు చందు మొండేటి సినిమాను రూపొందించారు. ప్రమోషన్ సమయంలో ఇది రియల్ స్టోరీ అంటూ ఎక్కువ ప్రమోట్ చేస్తూ వచ్చారు. దర్శకుడు చందు మొండేటి మాత్రం ఒక మంచి ప్రేమ కథ ఈ సినిమాలో ఉంటుందని చెబుతూ వచ్చారు. ఆయన చెప్పినట్లుగానే తండేల్‌లోని ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
'తండేల్'లోని రాజు, బుజ్జితల్లి మధ్య ఉండే ప్రేమ కథ హృదయాలను కదిలించే విధంగా ఉంది. మత్స్యకారుల రియల్ స్టోరీతో రూపొందిన సినిమా అనే ఆలోచనతో ఉండే ప్రేక్షకులను రీల్ లవ్ స్టోరీతో దర్శకుడు సర్‌ప్రైజ్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేమ కథ అద్భుతంగా సాగింది. సెకండ్ హాఫ్‌లోనూ పాకిస్తాన్ జైలు ఎపిసోడ్‌ని పరిమితం చేసి ఎక్కువ శాతం లవ్ సన్నివేశాలు, హీరో, హీరోయిన్ భావోద్వేగాలను చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఒక రియల్ స్టోరీ లైన్‌తో సినిమా రూపొందినా రీల్ స్టోరీ పూర్తిగా డామినేట్ చేసింది. తండేల్ అంటే రియల్ కథ అని కాకుండా ఒక మంచి ప్రేమ కథ అనే భావన కలిగించాడు దర్శకుడు చందు మొండేటి.
మత్స్యకారులకు సంబంధించిన సన్నివేశాలను ఎక్కువ పెట్టకుండా ఫస్ట్ హాఫ్‌లో లవ్ సీన్స్‌కి ప్రాముఖ్యత ఇచ్చారు. సెకండ్ హాఫ్‌లో దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్‌ను చూపించాడు. మొత్తానికి పాకిస్తాన్‌కి చిక్కిన మత్స్యకారుల కథను కాస్త ప్రేమ కథగా మల్చడంలో దర్శకుడు చందు మొండేటి నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. లవ్ స్టోరీ కాకుండా మొత్తం రియల్ స్టోరీతో సినిమాను తీసి ఉంటే కచ్చితంగా డాక్యుమెంట్ టైప్‌లో సినిమా ఉండేది. ఇక్కడ రియల్ స్టోరీని రీల్ లవ్ స్టోరీ డామినేట్ చేయడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమా నిలిచింది.
నాగ చైతన్య, సాయి పల్లవి కాంబో లవ్ సన్నివేశాలు ఈమధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలతో పోల్చితే నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. రియలిస్టిక్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు చందు మొండేటి ప్రేమకథను చక్కగా చూపించారు. రెండు హృదయాల బాధను, ఆవేధనను దర్శకుడు ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా వారి లవ్ స్టోరీతో ట్రావెల్ అయ్యే విధంగా స్క్రీన్ ప్లే సాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లవ్ సీన్స్‌కి ప్రాణం పోసినట్లుగా నిలిచాయి. బుజ్జి తల్లి పాట ముందు ముందు మరింత పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా తండేల్ ఒక మంచి ప్రేమ కథా చిత్రంగా నిలిచిపోయింది అనడంలో సందేహం లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూత్ ఆడియన్స్ ఎక్కువగా సినిమాలకు వస్తూ ఉంటారు. వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఈ లవ్ స్టోరీ ఉండటంతో కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.