Begin typing your search above and press return to search.

'దేవర' ఫేక్ కలెక్షన్స్.. కుండబద్దలు కొట్టిన నాగవంశీ

'దేవర 1' సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ తీసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Oct 2024 8:21 AM GMT
దేవర ఫేక్ కలెక్షన్స్.. కుండబద్దలు కొట్టిన నాగవంశీ
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా 'దేవర 1'. ఇటీవలే విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే 16 రోజుల్లోనే రూ.500 కోట్ల మైలురాయి మార్క్ క్రాస్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు. అయితే ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.

'దేవర 1' సినిమా రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగ వంశీ తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడారు. తారక్ నుంచి ఆరేళ్ళ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో, ఆయన మీదున్న ఇష్టంతో ఎలాగోలా దాంట్లో భాగం అవుదామనే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నట్లుగా చెప్పారు. 'దేవర' ఒక్క ఈస్ట్ మినహా మిగతా అన్ని ఏరియాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని తెలిపారు. జీఎస్టీ కలుపుకుంటే ఈస్ట్ లో కూడా బ్రేక్ ఈవెన్ అయినట్లేనన్నారు. నైజాం, వైజాగ్, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, చిత్తూర్, కర్నూల్ ప్రాంతాల్లో కమిషన్లు స్టార్ట్ అయినట్లుగా వెల్లడించారు.

మూవీ కలెక్షన్స్ పై నాగవంశీ స్పందిస్తూ, తాము గ్రాస్ మాత్రమే ప్రకటిస్తామని తెలిపారు. గ్రాస్ లో నెట్, షేర్, కమిషన్, ఖర్చులు వంటివి చాలా ఉంటాయని.. ఎంత మిగిలింది, చేతికి ఎంత వచ్చిందనేది బయట ఎవరికీ తెలియదని అన్నారు. కలెక్షన్స్ గ్రాస్ గురించి ఎప్పుడూ తప్పు చెప్పమన్నారు. వసూళ్ల విషయంలో ఫ్యాన్ వార్స్ జరిగినప్పటికీ.. హీరో మార్కెట్ ఎంత పెరిగిందనేది తెలియజెప్పడానికే గ్రాస్ ఫిగర్స్ చెబుతున్నామని తెలిపారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందరూ గ్రాస్ వసూళ్లు మాత్రమే చెప్తారని, ఇక్కడ కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నామని అన్నారు.

'దేవర' సినిమాకి మొదటి రోజు 20-30 శాతం కలెక్షన్స్ యాడ్ చేశారనే విమర్శలపై నాగవంశీ స్పందించారు. వసూలు చేయని డబ్బులు ఒక్క రూపాయి కూడా యాడ్ చెయ్యలేదని స్పష్టం చేసారు. తాను ఎప్పుడూ ఏ సినిమాకి కూడా కలెక్షన్స్ యాడ్ చెయ్యలేదని చెప్పారు. దేవర చిత్రానికి ఒక్క శాతం కూడా అదనంగా యాడ్ చెయ్యలేదని, కొన్ని ఏరియాల్లో స్పెషల్ షోల డబ్బులు మాత్రమే కలిపామని వెల్లడించారు. తనకు డబ్బు పోయిందంటే ఆనంద పడేవారే ఇలా కలెక్షన్స్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాగవంశీ కుండబద్దలు కొట్టారు. 'దేవర'తో తాను చాలా డబ్బు పోగొట్టుకున్నానని ఊహించుకుంటేనే కొంతమంది ఆనందంగా, సుఖంగా నిద్రపోతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

ఇటీవల 'లక్కీ భాస్కర్' ప్రెస్ మీట్ లోనూ 'దేవర' సినిమా కలెక్షన్స్ ఫేక్ అనే ప్రచారంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. కలెక్షన్స్‌ పోస్టర్స్ నిజమేనా? అని అడగ్గా.. ‘దేవర’కు అత్యధిక గ్రాస్‌ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం ఒరిజినల్‌ నంబర్స్‌ మాత్రమే తెలియజేశామని బదులిచ్చారు. తాను డబ్బులు వచ్చాయని చెబుతున్నా మీడియా నమ్మడం లేదని అన్నారు. అసలు కలెక్షన్స్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తే.. కేవలం హీరోల అభిమానులను సంతృప్తి పరచడం కోసమే మూవీ కలెక్షన్స్‌ పోస్టర్లు వేస్తామని, ఫ్యాన్స్ సంతోషంగా ఉంటే తాము కూడా ఆనందంగా ఉంటామని తెలిపారు. ఈ సంస్కృతి ఎప్పటినుంచో ఉంది. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉంది. గ్రాస్‌లో వచ్చేదానికి షేర్‌లో వచ్చేదానికి ఎలాంటి సంబంధం ఉండదని అధికారులకు అర్థమైందని నాగవంశీ పేర్కొన్నారు.