అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ!
ఇదంటుంచితే దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 28 Dec 2024 5:15 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప 2: ది రూల్" సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ సాధించాడు. 21 రోజుల్లోనే ₹1700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక నార్త్ ఇండియాలో అయితే ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. వందేళ్ల బాలీవుడ్ హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. అయితే సంధ్య థియేటర్ ఘటన కారణంగా బన్నీ ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేయలేకపోయారు. ఇదంటుంచితే దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి.
'పుష్ప 2' తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అప్పుడెప్పుడో అధికారికంగా ప్రకటించబడిన ఈ మూవీనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా పట్టాలెక్కబోతోంది. గీతా ఆర్ట్స్, హరిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. త్రివిక్రమ్ కు ఇది ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. భారీ స్కేల్ లో, రాజమౌళి కూడా టచ్ చేయని జోనర్ లో సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్‌ని దాదాపు పూర్తి చేశారు. ఫైనల్ స్క్రిప్ట్‌ను వివరించడానికి త్వరలో అల్లు అర్జున్‌ని కలవనున్నారని తెలుస్తోంది.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. "స్క్రిప్టింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. బన్నీ కొంచం ఫ్రీ అవ్వగానే, త్రివిక్రమ్ తో ఒకసారి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటారు. సినిమాలో హీరో పాత్ర బాడీ లాంగ్వేజ్ కోసం తనకి తాను ప్రిపేర్ అవ్వడానికి.. అలానే తెలుగు భాష మీద మరింత పట్టు సాధించదానికి మూడు నెలల సమయం పడుతుంది. అంతా అయ్యాక మెల్లగా సమ్మర్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం" అని వంశీ తెలిపారు.
"అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని అంటుకున్నాం. 2025 మధ్యలో స్టార్ట్ చేసి, 2026 ఎండింగ్ కి రిలీజ్ కి రెడీ అవుతుందని ఆశిస్తున్నాం. మోస్ట్లీ సమ్మర్ అవ్వగానే సినిమాని మొదలు పెడతాం. సినిమాలో భారీ సెట్ వర్క్ ఉంది. వీఎఫ్ఎక్స్ పోర్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకచోట ల్యాండ్ తీసుకొని ప్రత్యేకంగా సెట్స్ ఏర్పాటు చెయ్యాలని ఆలోచిస్తున్నాం. ప్రస్తుతానికైతే వీఎఫ్ఎక్స్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ అక్కడే చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారు" అని నాగ వంశీ చెప్పారు.
నాగ వంశీ చెప్పినదాని ప్రకారం, అల్లు అర్జున్ సెట్స్ లో అడుగుపెట్టడానికి మరో ఐదారు నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో ఆయన తనను తాను మార్చుకోవడానికి, సినిమాలో తన క్యారక్టర్ కోసం సిద్ధం కావడానికి శిక్షణ తీసుకోనున్నారు. అలానే కొత్త స్క్రిప్ట్స్ వినడానికి దొరికిన సమయాన్ని వినియోగించుకోనున్నారు. ఇప్పటికే కొందరు పాపులర్ డైరెక్టర్స్ తో ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేయనున్నారు.