దేవరకొండ కోసం దేవర.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత!
అయితే అప్డేట్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది నిర్మాత ఎస్.నాగవంశీ వెల్లడించారు.
By: Tupaki Desk | 26 Oct 2024 3:26 PM GMTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'VD 12' అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం ఫ్సాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ టైటిల్ అనౌన్స్ చేయడలేదని, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చెయ్యలేదని నిరాశ చెందుతున్నారు. అయితే అప్డేట్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనేది నిర్మాత ఎస్.నాగవంశీ వెల్లడించారు.
'లక్కీ భాస్కర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న నాగవంశీ.. తాజాగా విజయ్ దేవరకొండ సినిమా గురించి కూడా మాట్లాడారు. 'VD 12' టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదని నిర్మాత తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వల్లనే ఫస్ట్ గ్లింప్స్ ఆలస్యమవుతుందని చెప్పకనే చెప్పారు. అనిరుధ్ తో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా మనం అనుకున్నప్పుడు అది రాదు, అతను అనుకున్నప్పుడు వస్తుందని అన్నారు. అతను ఎప్పుడు అనుకుంటే అప్పుడు అన్నీ వస్తాయని నవ్వుతూ తెలిపారు.
విజయ్ దేవరకొండ సినిమాకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేదా నటసింహం నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇస్తారని కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై నాగవంశీ స్పందిస్తూ.. "ఫలానా డేట్ కి టీజర్ రిలీజ్ అని చెప్పి హీరోతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి, ఆ డేట్ మన చేతిలో ఉండదు.. అది అనిరుధ్ చేతిలో ఉంటుంది. అందుకే ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తర్వాతే వాయిస్ ఓవర్ చెప్పిద్దాం అని అలా వెయిట్ చేస్తున్నాం" అని చెప్పారు.
నాగవంశీ 'VD 12' అప్డేట్ ఎప్పుడు వస్తుందనేది చెప్పకపోయినా.. ఫస్ట్ గ్లింప్స్ లేదా టైటిల్ టీజర్ కు ఎన్టీఆర్, బాలయ్యలలో ఎవరో ఒకరితో వాయిస్ ఓవర్ చెప్పిస్తారనే విషయం మీద క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఇద్దరు నందమూరి హీరోలతో వంశీకి మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తారక్ తో 'అరవింద సమేత' సినిమా నిర్మించడమే కాదు, ఇటీవల 'దేవర' మూవీ రైట్స్ తీసుకొని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా 'NBK 109' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కి పలు సినిమాలకి వాయిస్ ఓవర్ చెప్పిన అనుభవం ఉంది. అందులోనూ #VD12 పాన్ ఇండియా మూవీ కాబట్టి, ఆయనతోనే నాగవంశీ వాయిస్ చెప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే యంగ్ టైగర్ పవర్ ఫుల్ వాయిస్.. విజయ్ దేవరకొండ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. సో అనిరుధ్ వీలైనంత త్వరగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తే, తారక్ గాత్రంతో విజయ్ మూవీ టైటిల్ టీజర్ ను చూసే అవకాశం దక్కుతుంది. కాకపోతే నిర్మాత చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇప్పుడప్పుడే గ్లింప్స్ వచ్చేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా 'VD 12' రూపొందుతోంది. గౌతమ్ తిన్ననూరి KGF తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని నిర్మాత నాగవంశీ హైప్ ఎక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన 'మిస్టర్ బచ్చన్' ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన వీడీ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని 2025 మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు. కానీ విడుదల తేదీ మారే అవకాశం ఉంది.