హిట్ అయితే ఎవరూ ఆపలేరు : నాగవంశీ
తమ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సినిమా మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను నాగవంశీ వ్యక్తం చేశాడు.
By: Tupaki Desk | 25 March 2025 8:57 PM ISTటాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న నిర్మాత పేరు నాగవంశీ. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో వరుసగా సినిమాలను నిర్మిస్తున్న నాగవంశీ తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని నాగవంశీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం నాగ వంశీ మీడియాతో మాట్లాడారు. తమ బ్యానర్‌లో నిర్మాణం జరిగిన మ్యాడ్ స్క్వేర్ సినిమా విడుదల నేపథ్యంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. తమ బ్యానర్ నుంచి రాబోతున్న ఈ సినిమా మరో విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసంను నాగవంశీ వ్యక్తం చేశాడు.
ఇంకా నాగవంశీ మాట్లాడుతూ పైరసీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెద్ద సినిమాలకు పైరసీ అనేది పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకొచ్చాడు. అయితే సినిమా హిట్ అయితే ఈ మధ్య పైరసీ వల్ల ఇబ్బంది కలగడం లేదని చెప్పుకొచ్చాడు. సినిమాకు హిట్ టాక్ వస్తే ప్రేక్షకులు థియేటర్‌కి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకు నెగటివ్ టాక్ వస్తే అప్పుడు పైరసీ చూస్తారని నాగ వంశీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ వల్ల నిర్మాతలకు భారీ నష్టం అన్నారు. సినిమా హిట్ అయినప్పుడు పైరసీ మాత్రమే కాకుండా ఎవరూ ఆపలేరు అనేది నాగవంశీ అభిప్రాయం. ప్రేక్షకులు థియేటర్‌కి హిట్ టాక్ వచ్చిన తర్వాతే వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారని నాగవంశీ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
మొన్న సంక్రాంతికి బాలకృష్ణ తో నిర్మించిన డాకు మహారాజ్ సినిమాను తీసుకు వచ్చారు. ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందు డాకు మహారాజ్ సినిమా వసూళ్లు నిలవలేదు. రాంగ్ టైమింగ్‌లో డాకు మహారాజ్ విడుదల అయిందనే టాక్ వచ్చింది. వసూళ్ళ పరంగా తక్కువే అయినా ఓటీటీ రైట్స్ ఇతర రైట్స్ ద్వారా సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీగానే లాభాలు దక్కించుకుందని టాక్. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో పది సినిమాలకు మించి నిర్మాణంలో ఉన్నాయి. మరో అయిదు ఆరు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఒక వైపు వందల కోట్ల బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న వీరు చిన్న సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.
మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న నిర్మాత నాగవంశీ వెంటనే సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. మ్యాడ్ స్క్వేర్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. డీజే స్వ్వేర్ తో హిట్ దక్కించుకున్న నాగవంశీ మరో స్క్వేర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కథల ఎంపిక విషయంలో నాగ వంశీ వైవిధ్యభరితంగా ఆలోచిస్తారనే టాక్ ఉంది. తెలుగు సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలను డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. మొత్తానికి టాలీవుడ్‌లో మోస్ట్ యాక్టివ్ నిర్మాతగా నాగ వంశీ ఉన్నారు.