జిమ్‌లో మెగా బ్రదర్... ఇది లేనిది జీవితమే లేదు
అందుకే ఆయన తిరిగి సోషల్ మీడియాలో ఈ మధ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వరుసగా పోస్ట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
By: Tupaki Desk | 29 Dec 2024 4:05 PM GMTమెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఇంతకు ముందు సినిమాల్లో వరుసగా నటించేవారు. కానీ ఈమధ్య కాలంలో ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు. కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాల్లో నటించడం లేదు. మళ్లీ ఆయన నటిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన నటించే అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తోంది. ఆయన ఆ మధ్య అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. నడిచేందుకు ఇబ్బంది ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే ఆయన తిరిగి సోషల్ మీడియాలో ఈ మధ్య క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వరుసగా పోస్ట్‌లు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తాజాగా జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వ్యాయామం లేనిది జీవితమే లేదు అంటూ ఆ వీడియోను షేర్ చేశారు. కచ్చితంగా ప్రతి మనిషి వ్యాయామం చేయాలి అంటూ ఆయన ఈ సందర్భంగా సందేశం ఇచ్చారు. తనకన్నా పెద్దవారు అయిన చిరంజీవితో పోల్చితే నాగబాబు వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తారు. అందుకే ఇప్పుడు ఆయన వ్యాయామం మొదలు పెట్టారేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, సినిమా ఇండస్ట్రీలో లేకున్నా మీకు వ్యాయామం పట్ల ఉన్న ఆసక్తి అభినందనీయం. మీరు ఎంతో మందికి ఆదర్శనీయం అంటూ కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నాగబాబు త్వరలో ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. దాంతో అందరి దృష్టి ఎప్పుడు నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. నాగబాబు జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ కోసం ఆయన చాలా కష్టపడ్డారు అనే విషయం తెల్సిందే. అందుకే ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి రావాలి అని కోరుకున్న వారు చాలా మంది ఉన్నారు. తాజాగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తేజ్ ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న ఏదో ఒక సినిమాలో నాగబాబు కీలక పాత్రలో నటిస్తే చూడాలని ఉందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సినిమాలో నాగబాబు, వరుణ్ తేజ్‌లను తండ్రి కొడుకులుగా చూడాలని ఉందని, ఎప్పటికి అది తీరుతుందని కొందరు నాగబాబును సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.