పదవుల ప్రచారంపై నాగబాబు ఏమనుకుంటున్నారు?
మెగా ప్రేక్షకాభిమానులు కూడా అంతే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 7 Jun 2024 6:00 AM GMTకూటమి అధికారంలోకి రావడంతో మెగా కుటుంబం లో ఆనందానికి అవదుల్లేవ్. తొలిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న ఆనందంలో కుటుంబ సహా సేనాని అభిమానులంతా సంబురాలు చేసుకుంటున్నారు. అలాగే కూటమిలో పవన్ కి సముచిత స్థానం దక్కుతుందని కేంద్ర మంత్రి అయినా అవ్వొచ్చు..రాష్ట్ర మంత్రి అయినా అవ్వొచ్చు. ఏదైనా జరగడానికి ఆస్కారం ఉందని నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.
మెగా ప్రేక్షకాభిమానులు కూడా అంతే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అతడే కావడంతో డిమాండ్లు నెరవేర్చడానికి అవకాశం ఉందంటున్నారు. ఈ సంగతి పక్కనబెడితే కూటమి కారణంగా మెగా బ్రదర్ నాగబాబు సీటు దానం చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఏదో అసెంబ్లీ స్థానానికి నాగబాబు కూడా పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ కూటమి ప్రభావంతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నాగబాబు ఏదోక నామినేటెడ్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా టీటీడీ చైర్మన్ పదవి ఆయనదే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం ఠారెత్తి పోతుంది. జనసేన పార్టీలో నాగబాబు జనరల్ సెక్రటరీగా తన సేవలు అందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ పదవికి నాగబాబు అన్ని రకాలుగా అర్హులంటూ మెగా అభిమానులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కోల్పోవడంతో పవన్ కల్యాణ్ కూడా అన్నయ్యకి ఏదో పదవి ఇచ్చే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో కనిపిస్తుంది.
ఈనేపథ్యంలో టీటీడీ పదవి తెరపైకి వచ్చింది. అయితే ఈ పుకార్లను నాగబాబు కొట్టిపారేసారు. ఎలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దన్నారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చిన విషయాల్ని మాత్రమే నమ్మాల్సిం దిగా కోరారు. తప్పుడు వార్తలు రాయోద్దు..వాటిని నమ్మకండి` అని ఆయన ట్వీట్ చేశారు. అయినా ప్రచారం మాత్రం ఆగలేదు. టీటీడీ కాకపోతే ఎంపీగా రాజ్యసభకు లేదంటే? ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లొచ్చని కొత్త ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. అయితే అసలు పదవుల విషయంలో నాగబాబు మనసులో మాట ఏంటన్నది? తెలియాల్సి ఉంది.