చిరంజీవి వల్ల సినిమాల్లోకి రాకూడదనుకున్నా: నాగార్జున
ఇలాంటి బ్రేక్ డ్యాన్సులు తనవల్ల కాదనుకుని, నటరంగం కాకుండా వేరే దారి వెతుక్కోవాలనుకున్నానని, అక్కడి నుంచి వచ్చేశానని కింగ్ నాగార్జున వెల్లడించారు.
By: Tupaki Desk | 17 Dec 2024 2:02 AM GMTటాలీవుడ్ లో మూలస్థంబాలుగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున. తెలుగు సినీపరిశ్రమ పెద్దలుగా వారిపై అపారమైన గౌరవం ఉంది. ఇక నాగార్జున కంటే ముందే చిరంజీవి నటుడిగా ఆరంగేట్రం చేసారు. ఆయన ఎదిగే క్రమంలో బ్రేక్ డ్యాన్సులతో షేక్ చేసేవారు. అలా ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి డ్యాన్సులు చూసి నేర్చుకోవాల్సిందిగా పురమాయించారు అక్కినేని నాగేశ్వరరావు. ఆ సమయంలో నాగార్జున చిరంజీవి షూటింగ్ చేస్తున్న చోటికి వెళ్లి ఆయన డ్యాన్సులు చేస్తుంటే ప్రత్యక్షంగా చూశారు.
ఇలాంటి బ్రేక్ డ్యాన్సులు తనవల్ల కాదనుకుని, నటరంగం కాకుండా వేరే దారి వెతుక్కోవాలనుకున్నానని, అక్కడి నుంచి వచ్చేశానని కింగ్ నాగార్జున వెల్లడించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని అందించిన వేదికపై నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. బిగ్ బి అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఈ రహస్యాన్ని ఓపెనయ్యారు.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఒదిగి ఉండే స్వభావం గురించి కూడా ఈ వేదికపై ప్రశంసలు కురిపించారు నాగార్జున. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి అక్కినేని అంతర్జాతీయ పురస్కారం అందించే క్రమంలో ప్రోటోకాల్ కారణంగా వేదికపైకి వెళ్లేందుకు వీలు లేదని ముందే చిరంజీవి గారికి చెబితే.. ఆయన మరో మాట లేకుండా వేదిక దిగువన కూచుని వేడుకను వీక్షించారని అంత పెద్ద స్టార్ ఇంతగా ఒదిగి ఉండడం తనను నిజంగా ఆశ్చర్యపరిచిందని నాగ్ వేదికపైనే ఎమోషనల్ అవుతూ చెప్పారు. అలాగే తాను అమితాబ్ కి శాలువా కప్పాలనుకున్నప్పుడు తన అనుమతి కోరారని కూడా నాగార్జున గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ వీడియో యువతరంలో వైరల్ గా మారుతోంది.