Begin typing your search above and press return to search.

'ఇంద్ర' తరహాలో 'శివ' రీ రిలీజ్‌...!

టాలీవుడ్‌ లో రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. ఆ మధ్య వరుసగా స్టార్‌ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:30 AM GMT
ఇంద్ర తరహాలో శివ రీ రిలీజ్‌...!
X

టాలీవుడ్‌ లో రీ రిలీజ్ ట్రెండ్‌ నడుస్తోంది. ఆ మధ్య వరుసగా స్టార్‌ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కాస్త రీ రిలీజ్ ల జోరు తగ్గిందని అనుకుంటున్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన 'ఇంద్ర' సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొంత కాలంగా రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం పెద్దగా క్వాలిటీ లేకుండానే వచ్చాయి. 4కే రెజల్యూషన్‌, అత్యాధునిక సౌండ్‌ తో అంటూ కొన్ని సినిమాలు నాసిరకం క్వాలిటీతో వచ్చాయి. కానీ ఇంద్ర సినిమా మాత్రం పిక్చర్‌ క్వాలిటీతో పాటు సౌండ్‌ క్వాలిటీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ పాత సినిమా ఇంత క్వాలిటీగా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

గతంలో ఇంద్ర సినిమాను థియేటర్ లో చూసిన వారు రీ రిలీజ్ లో థియేటర్ లో చూసిన వారు ఆశ్చర్యపోయారు. చిరంజీవిని మరింత అందంగా చూపించడంతో పాటు ప్రతి సన్నివేశాన్ని కూడా అద్భుతంగా కలర్‌ ఫుల్ గా చూపించారు. దాంతో ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా తమ హీరోల పాత సినిమాలను అంతే క్వాలిటీ తో రీ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. ఇంద్ర స్థాయి క్వాలిటీతో త్వరలో నాగార్జున శివ రాబోతుందని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం శివ సినిమా రీ రిలీజ్ అయ్యింది. ఆ సమయంలో పిక్చర్‌ క్వాలిటీ విషయంలో విమర్శలు వచ్చాయి. అందుకే మరోసారి శివను తీసుకు వచ్చేందుకు రెడీ చేస్తున్నారు.

నేడు నాగార్జున పుట్టిన రోజు. ఆ సందర్భంగా నేడు శివను రీ రిలీజ్ చేయాలని భావించారు. కానీ 4కే రెజల్యూషన్ కి సంబంధించిన వర్క్‌ ఇంకా పూర్తి కాలేదు. అంతర్జాతీయ స్థాయి సంస్థతో ప్రస్తుతం సినిమాకు వర్క్ చేయిస్తున్నట్లుగా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. శివ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవ్వక పోవడంతో ఆ స్థానంలో మాస్‌ ను రీ రిలీజ్ చేశారు. మాస్‌ ను నేడు థియేటర్‌ లో స్క్రీనింగ్‌ చేశారు. మాస్ తో పాటు శివ రీ రిలీజ్ థియేట్రికల్‌ ట్రైలర్‌ ను జత చేశారు.

శివ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఉన్న ట్రైలర్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి సమయం, సందర్భం చూసి శివ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. నెమ్మదిగానే వర్క్ పూర్తి చేసి, క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా అద్భుతమైన ఔట్‌ పుట్‌ ను అక్కినేని ఫ్యాన్స్‌ కి ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జున హీరోగా రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాలు అవ్వబోతున్న శివ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అంటే వర్మ ఏ స్థాయిలో సినిమాను రూపొందించాడో అర్థం చేసుకోవచ్చు.