'అక్కినేని' వేదన అర్థమైందా?
కానీ నిన్నటి ‘తండేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం నాగ్‌లోని ఎమోషనల్ కోణం బయటికి వచ్చింది.
By: Tupaki Desk | 12 Feb 2025 7:44 AM GMTఅక్కినేని నాగార్జున స్టేజ్ మీద ఉంటే అస్సలు నాటకీయత ఉండదు. ఆయన ఎమోషనల్ అవ్వడం అరుదు. చాలా జాలీగా కనిపిస్తారు. సరదాగా మాట్లాడుతుంటారు. కానీ నిన్నటి ‘తండేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రం నాగ్‌లోని ఎమోషనల్ కోణం బయటికి వచ్చింది. మరీ కన్నీళ్లు పెట్టేసుకుని నాటకీయంగా ఏమీ ప్రవర్తించలేదు కానీ.. ఆయన కొంత కాలంగా ఎంత బాధను అనుభవించారు, ఇప్పుడెంత సంతోషంగా ఉన్నారు అన్నది మాత్రం తన ప్రసంగంలో బయటపడిపోయింది.
‘తండేల్’ ఫలితం చైతూ కంటే నాగార్జునకు అమితానందాన్నిచ్చిన విషయం స్పష్టంగా అర్థమైపోయింది. దర్శకుడు చందూ మొండేటికి.. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు గురించి మాట్లాడిన తీరులో నాగ్ కృతజ్ఞతాభావం కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ రోజుల్లో ఒక మంచి సినిమా తీసి హిట్టు కొట్టడం ఎంత కష్టమో నాగ్ చాలా బలంగా చెప్పారు.
తన కొడుకు ముఖంలో మళ్లీ ఆనందం చూడడం గురించి.. ‘తండేల్’ రిలీజ్ రోజు వచ్చిన స్పందన గురించి నాగ్ మాట్లాడిన మాటలు గుండె లోతుల్లోంచి వచ్చినట్లు కనిపించాయి. కష్ట కాలంలో తమకు తోడుగా నిలిచి.. ఇప్పుడు ‘తండేల్’ ఫలితంతో అమితానందంలో ఉన్న అక్కినేని అభిమానుల గురించి కూడా నాగ్ హృదయపూర్వకంగా మాట్లాడారు. గత కొన్నేళ్ల నుంచి ఆశించిన హిట్లు లేక ఇటు అక్కినేని హీరోలు, అటు అక్కినేని అభిమానులు ఎంత వేదనకు గురయ్యారో నాగ్ మాటలతో స్పష్టంగా అర్థమైంది.
చైతూకేమో థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్లు పడితే.. అఖిల్ ‘ఏజెంట్’తో దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. నాగ్ సైతం ‘వైల్డ్ డాగ్’, ‘ఘోస్ట్’ చిత్రాలతో కంగు తిన్నాడు. ఓవైపు వేరే పెద్ద ఫ్యామిలీస్‌కు చెందిన హీరోలు ఘనవిజయాలు అందుకుంటూ.. మార్కెట్ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతుంటే.. అక్కినేని వారి మార్కెట్ మాత్రం అంతకంతకూ కరిగిపోతూ లెగసీనే ప్రమాదంలో పడే పరిస్థితి కనిపించింది. ఇలాంటి టైంలో ‘తండేల్’ రూపంలో ఓ మంచి విజయం దక్కడం ఇటు అక్కినేని ఫ్యామిలీకి, అటు అభిమానులు గొప్ప ఉపశమనం. అదే నాగ్ మాటల్లో ప్రతిబింబించింది. ఈ వేడుక చివర్లో నాగ్ అన్నట్లు ‘తండేల్’ ఇచ్చిన ఉత్సాహంలో ఇక నుంచి అక్కినేని వారు వరుస హిట్లు డెలివర్ చేస్తారేమో చూడాలి.