Begin typing your search above and press return to search.

చిరంజీవి డ్యాన్సుల్లో గ్రేస్ చూసి భ‌య‌ప‌డ్డాను: నాగార్జున‌

ప్ర‌తిష్ఠాత్మ‌క ఏఎన్నార్ జాతీయ అవార్డ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:45 PM GMT
చిరంజీవి డ్యాన్సుల్లో గ్రేస్ చూసి భ‌య‌ప‌డ్డాను: నాగార్జున‌
X

ప్ర‌తిష్ఠాత్మ‌క ఏఎన్నార్ జాతీయ అవార్డ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్ లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో అమితాబ్, చిరంజీవి, నాగార్జున‌, అశ్వ‌నిద‌త్ స‌హా ప‌లువురు దిగ్గ‌జాలు పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను ఏఎన్ఆర్ జాతీయ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌క‌టించింది అక్కినేని కుటుంబం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల‌మీదుగా ఈ అవార్డును టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అందజేయ‌డం అరుదైన దృశ్యం.

ఈ అరుదైన వేదిక‌పై ముఖ్య అతిథి అమితాబ్ ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. తెలుగు చిత్ర‌సీమ‌లో స‌భ్యుడిని కావ‌డం గ‌ర్వ‌కార‌ణం అని అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ వేదిక‌పై అన్నారు. ఆయ‌న తెలుగు సినిమా స్టార్ల‌ను ప్ర‌శంసించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున ఎమోషనల్ స్పీచ్ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవితో త‌న అనుబంధం గురించి నాగ్ మాట్లాడారు. ``మీరు సమాజం నుండి ఏదైనా తీసుకుంటే, సమాజానికి ఏదైనా ఇవ్వాలి అని మా నాన్నగారు ఎప్పటినుంచో నమ్ముతారు. చిరంజీవిగారిలో ఈ గుణం ఉంది`` అని నాగార్జున అన్నారు. చిరంజీవికి ఏఎన్నార్ జాతీయ‌ అవార్డును అందించడంలో తాను త‌న కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నామ‌ని నాగార్జున అన్నారు. తన ప్రసంగంలో మెగాస్టార్‌తో కొన్ని మధుర జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు.

``1985లో నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు చిరంజీవి గారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా చేస్తున్నారు. చిరు ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూడ‌మని నాన్న అడిగారు. ఆ రోజు ఆయన డ్యాన్స్‌లలో ఉన్న గ్రేస్, చరిష్మా చూసి కాస్త భయమేసి డ్యాన్స్‌లలో ఆయనతో సరిపెట్టుకోగలనా అని అనిపించింది. ఆ తర్వాత కెరీర్‌ ప్లాన్‌ మార్చుకోవాలని అనుకున్నాను`` అని నాగార్జున తెలిపారు.

చిరంజీవిలో ఒదిగి ఉండే స్వ‌భావాన్ని కింగ్ ఈ వేదిక‌పై హైలైట్ చేసారు. ``కొన్నేళ్ల క్రితం లెజెండ‌రీ అమితాబ్ కి ఇదే ఏఎన్నార్ జాతీయ‌ అవార్డును అందజేస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి హాజరుకావాలని చిరంజీవిగారిని అడిగాను. ప్రోటోకాల్ ఉందని వేదికపైకి పిలవలేనని కూడా ఆయ‌న‌కు చెప్పాను. అయితే దానిని సులువుగా అంగీకరించి చిరు వేదిక ముందు కూర్చున్నారు. ఆ తర్వాత అమితాబ్ గారికి శాలువాతో సత్కరించేందుకు ఆయన నా నుంచి అనుమతి కోరారు. ఇది చిరంజీవిగారి వినయానికి నిద‌ర్శనం`` అని నాగార్జున అన్నారు.