Begin typing your search above and press return to search.

చైతూ, శోభిత పెళ్లి... నాగార్జున ట్వీట్‌ వైరల్‌

నాగ చైతన్య, శోభితల వివాహం చూసి తన హృదయం ఉప్పొంగింది అంటూ నాగార్జున కాస్త లోతైన పదాలను వాడుతూ ట్వీట్‌ చేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 6:45 AM GMT
చైతూ, శోభిత పెళ్లి... నాగార్జున ట్వీట్‌ వైరల్‌
X

అక్కినేని నాగ చైతన్య, శోభితల వివాహం వైభవంగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఏయన్నార్‌ వారి విగ్రహం ముందు ప్రత్యేకంగా వేసిన పెళ్లి మండపంలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ఆప్త మిత్రుల మధ్య వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు పెళ్లికి హాజరు అయిన వారు చాలా మంది ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా చైతూ, శోభిత పెళ్లి గురించి మాట్లాడుతూ ఫోటోలను పంచుకోవడం జరిగింది. ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది.

నాగ చైతన్య, శోభితల వివాహం చూసి తన హృదయం ఉప్పొంగింది అంటూ నాగార్జున కాస్త లోతైన పదాలను వాడుతూ ట్వీట్‌ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ నాగార్జున తండ్రి ప్రేమను చూపించారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌లో ఆయన తన ఉద్వేగపూరిత సందేశాన్ని షేర్‌ చేయడంతో పాటు కొత్త దంపతులకు సంబంధించిన ఫోటోలను సైతం తన అభిమానులు, మీడియా వారు, నెటిజన్స్‌తో పంచుకున్నారు.

నాగార్జున ఎక్స్‌ ద్వారా.. మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. నాగ చైతన్య, శోభితల పెళ్లి గురించి ప్రముఖంగా మీడియాలో చోటు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యుల యొక్క ప్రేమ, అభిమానంకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు పెళ్లి వేడుకలో పాల్గొన్న వారు అందరికీ కృతజ్ఞతలు. మీరు అంతా మాతో పంచుకున్న సంతోషంను ఎప్పటికీ మరచిపోలేము. ఇది లైఫ్‌ లాంగ్‌ గుర్తుండి పోయే జ్ఞాపకం అంటూ నాగార్జున పేర్కొన్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో స్థలాభావం వల్ల అభిమానులను పెద్ద ఎత్తున ఆహ్వానించలేక పోయారు. అతి కొద్ది మంది ఫ్యాన్స్‌కి నాగ చైతన్య, శోభితల వివాహం చూసే అవకాశం దక్కింది. మీడియా వారికి సైతం ఎక్కువ ఛాన్స్ దక్కలేదు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల్లో చిరంజీవితో పాటు మరికొందరు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని కొత్త వధూవరులను ఆశీర్వదించారు. మేనమామగా నాగ చైతన్యకు తోడుగా వెంకటేష్ ఉండి ఈ పెళ్లి తంతు జరిపారు. ఇక రానా తన అత్త కొడుకు అయిన చైతూ పెళ్లిలో చాలా హడావుడి చేశాడు. ఇక శోభిత మెడలో చైతూ తాళి కడుతున్న సమయంలో అఖిల్‌ విజిల్స్ వేసి సందడి చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. మొత్తానికి ఒక పండుగా మాదిరిగా అక్కినేని వారి ఇంట పెళ్లి జరిగింది.