కింగ్ సెంచరీ కొట్టేది కూడా వాళ్లతోనేనా!
కింగ్ నాగార్జున ల్యాండ్ మార్క్ చిత్రం 100వ సినిమాకి అతి చేరువలో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 Jan 2024 7:46 AM GMTకింగ్ నాగార్జున ల్యాండ్ మార్క్ చిత్రం 100వ సినిమాకి అతి చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి `నా సామి రంగ` అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే `గుంటూరు కారం`..`సైంధవ్` చిత్రాలు రిలీజ్ అయిపోయాయి. దీంతో నాగ్ సినిమా ఎలా ఉంటుంది? అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలై పోయింది.
సంక్రాంతి కి కిట్టయ్య హడావుడి ఎలా ఉంటుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సంగతి పక్కన బెడితే నాగ్ 100 సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్న అంశం కొన్ని నెలలుగా సస్పెన్స్ గా మారిన సంగతి తెలిసిందే. 100వ సినిమా కావడంతో కచ్చితంగా స్టార్ డైరెక్టర్ ని రంగంలోకి దించుతా రని..యూనిక్ కంటెంట్ తోనే పాన్ ఇండియాలో ప్లాన్ చేసే అవకాశం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇంతవరకూ కింగ్ పాన్ ఇండియా సినిమా చేయకపోవడంతో! 100వ సినిమాకి ఆ ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు.
అలాగే నాగ్ ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూ దర్శకులుగా పరిచయం చేసిన నేపథ్యంలో 100వ సినిమా విషయంలో మాత్రం ఆ ఛాన్స్ తీసుకోరని గట్టిగానే వినిపించింది. కానీ కింగ్ మాటల్ని బట్టి 100వ సినిమా విషయంలో ఆయనకు ఎలాంటి ప్లానింగ్ లేనట్లే తెలుస్తుంది. 100వ సినిమా గురించి అడిగితే ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆవేంటో ఆయన మాటల్లోనే..` నాకు ల్యాండ్ మార్క్ చిత్రాలు అలా చేయాలనుకుంటే `శివ`..`గీతాంజలి`..`నిన్నే పెళ్లాడతా`.. `అన్నమయ్య` లాంటి సినిమాలు ఉండేవి కాదు.
నేనెప్పుడు నా సినిమా కొత్తగా ఉండాలని కోరుకుంటా. నా అభిమానులు కోరుకున్నట్లు స్టార్ దర్శకులతో పనిచేసా. వాటి ఫలితాలు ఏంటో అందిరకీ తెలుసు(నవ్వుతూ). `మాస్` ని తీసుకోండి. లారెన్స్ కి అదే తొలి చిత్రం. కానీ అదోక కల్ట్ సినిమాగా పేరొచ్చింది. హిందీలో దక్షిణాది చిత్రాలకు మార్కెట్ ఓపెన్ చేసింది. `నిన్నే పెళ్లాడతా`..`అన్నమయ్య` యూఎస్ ఏ మార్కెట్ తెరుచుకునేలా చేసాయి. ` శివ` ..`గీతాంజలి` నన్ను స్టార్ గా మార్చాయి` అని అన్నారు.