నీ తప్పేమీ లేదు: నాగార్జున
నాగ్ తో ఓ అభిమాని ఫోటో దిగడానికి ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బాడీగార్డ్ ఆ దివ్యాంగుడిని వెనక్కి లాగాడు
By: Tupaki Desk | 26 Jun 2024 12:37 PM GMTటాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ప్రస్తుతం కుబేర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ కూడా నటిస్తున్న ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి విడుదలైన నాగ్ లుక్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే రీసెంట్ గా ముంబై ఎయిర్ పోర్ట్ లో నాగార్జున బౌన్సర్ ఓ దివ్యాంగుడి పట్ల దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.
నాగ్ తో ఓ అభిమాని ఫోటో దిగడానికి ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బాడీగార్డ్ ఆ దివ్యాంగుడిని వెనక్కి లాగాడు. దీంతో అతడు ఒక్కసారిగా కిందపడబోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. బాడీగార్డ్ చేసిన తప్పు వల్ల నాగార్జున తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత నాగార్జున ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు. అలా జరగాల్సింది కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
తాజాగా కుబేర షూటింగ్ లో పాల్గొనేందుకు నాగార్జున మరోసారి ముంబై వెళ్లారు. మొన్న కిందపడబోయిన ఫ్యాన్ నేడు నాగార్జున దగ్గరకు వచ్చాడు. అతడు రాగానే.. మొన్న మీతో ఫోటో దిగాలనుకున్నది ఇతడే అని ఫోటోగ్రాఫర్లు గుర్తు చేశారు. దీంతో నాగ్ అతడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. అతడితో ఫోటోలు కూడా దిగారు. కాసేపు మాట్లాడారు. అప్పుడు అతడు నాగార్జునకు సారీ చెప్పగా.. ఇందులో నీ తప్పేమీ లేదని నాగ్ అన్నారు.
మొన్న బాడీ గార్డ్ చేసిన పని వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున.. ఇప్పుడు ఆ అభిమానితో పిక్ తీసుకోవడం విశేషం. మిగిలిన ఫ్యాన్స్ తో కూడా నాగ్ ఈసారి ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. నాగార్జున అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. మా నాగ్ సార్ బంగారం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నాగ్ తో ఫోటో దిగడంతో ఆ ఫ్యాన్ ఫుల్ హ్యాపీ అయ్యాడు.
అయితే నాగార్జున సంక్రాంతికి నా సామిరంగా మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కుబేరలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. అయితే మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడంలో శేఖర్ కమ్ముల దిట్ట. తన మార్క్ స్టోరీలను సిల్వర్ స్క్రీన్ పై హోమ్లీగా చూపిస్తారు. మరి కుబేరలో నాగార్జున రోల్ ను శేఖర్ కమ్ముల ఎలా డిజైన్ చేశారో చూడాలి.