Begin typing your search above and press return to search.

నాగ్, మ్యాడీల రేంజ్ క్రేజ్ అంటే ఎవరికైనా కష్టమే!

అయితే నాగార్జున హిందీ చిత్ర పరిశ్రమ మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా, టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 5:01 PM GMT
నాగ్, మ్యాడీల రేంజ్ క్రేజ్ అంటే ఎవరికైనా కష్టమే!
X

మన సౌత్ స్టార్ హీరోలు ఇప్పుడు నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. భారీ వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కొడుతూ, సరికొత్త 'పాన్ ఇండియన్ స్టార్స్' గా వెలుగొందుతున్నారు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో బాలీవుడ్ స్టార్ హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్ లాంటి హీరోలు ఉత్తరాదిలో మాంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే వీరంతా మాస్ యాక్షన్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారే కానీ, రొమాంటిక్ హీరోలుగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోలేకపోయారు.

గతంలో సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన హీరోలలో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు. 90స్ లో 'శివ' రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాగ్.. 'ఖుదాగావా', 'ద్రోహి', 'క్రిమినల్' లాంటి సినిమాలతో అక్కడ క్రేజీ హీరోగా మారిపోయారు. అమ్మాయిల కలల రాకుమారుడుగా లేడీ ఫ్యాన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. చార్మింగ్ పర్సనాలిటీతో బాలీవుడ్ హీరోయిన్ల ఫస్ట్ క్రష్ లిస్టులో చేరిపోయారు. అయితే నాగార్జున హిందీ చిత్ర పరిశ్రమ మీద ఎక్కువగా ఫోకస్ చేయకుండా, టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయినప్పటికీ మాస్, డాన్, కింగ్ లాంటి హిందీ డబ్బింగ్ చిత్రాలతో తన ఫాలోయింగ్ గుర్తు చేస్తుంటారు. ఇక నాగ్ క్రేజ్ ఇంకా తగ్గలేదనే విషయం 'బ్రహ్మాస్త్ర' మూవీతో మరోసారి నిరూపించబడింది.

రొమాంటిక్ హీరోగా నాగార్జున తర్వాత ఆ రేంజ్ లో ఉత్తరాది జనాలు ఇష్టపడిన సౌత్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే, అది ఆర్. మాధవన్ అని చెప్పాలి. 2001లో 'చెలి' హిందీ రీమేక్ తో తొలిసారిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన మ్యాడీ.. ఫస్ట్ మూవీతోనే మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. లేడీస్ లో ఈ హ్యాండ్సమ్ హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ మరో హీరోకి లేదనే అనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఆయన్ను ఇష్టపడే వారు చాలామందే ఉన్నారు. నాగ్, మ్యాడీల తర్వాత ఎందరో సౌత్ హీరోలు నార్త్ కి వెళ్లారు కానీ.. అలాంటి ఇమేజ్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయారు.

పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత యంగ్ రెబల్ ప్రభాస్ బాలీవుడ్ బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపించారు. 'బాహుబలి 1' 'బాహుబలి 2' 'సాహో' సినిమాలు హిందీలో ఎలాంటి సక్సెస్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప: ది రైజ్' మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తగ్గేదేలే అంటూ నార్త్ లో దూసుకుపోయారు. ఇదే క్రమంలో RRR సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉత్తరాది ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. KGF చిత్రాలతో కన్నడ హీరో యష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఈ సౌత్ స్టార్స్ అందరూ నార్త్ లో మాస్ యాక్షన్ హీరోలుగా మాత్రమే క్రేజ్ దక్కించుకున్నారు. ఒకప్పుడు నాగార్జున, ఆ తర్వాత మాధవన్ లకు లేడీ ఫ్యాన్స్ లో ఉన్నటువంటి క్రేజ్ ను సొంతం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వెయ్యాలని చూస్తున్న దక్షిణాది హీరోలలో, ఎవరికి కూడా అలాంటి ఇమేజ్ సంపాదించే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లంతా యాక్షన్ హీరోలుగానే పేరు తెచ్చుకోడానికే ప్రయత్నాలు చేస్తున్నారు.

'లైగర్' తో నార్త్ లో భంగపడ్డ విజయ్ దేవరకొండ ఆ మధ్య 'ఖుషి' అంటూ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చారు కానీ, పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వీడీ. మరి రానున్న రోజుల్లో మన రౌడీ హీరో అయినా ఉత్తరాదిలో నాగ్, మ్యాడీల మాదిరిగా లేడీస్ లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటారేమో చూడాలి.