Begin typing your search above and press return to search.

ఆ విషయంలో రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ గ్రేట్?

అంతేకాదు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జక్కనలను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

By:  Tupaki Desk   |   26 Jun 2024 5:30 PM GMT
ఆ విషయంలో రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ గ్రేట్?
X

'కల్కి' విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ మూవీ మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు ఐదారు నెలల తర్వాత థియేటర్లలోకి రాబోతున్న పెద్ద హీరో సినిమా కావడంతో, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని నమ్ముతున్నారు. ఓపెనింగ్స్ తోనే చాలా రికార్డులు బ్రేక్ అవుతాయని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ అందరూ రాజమౌళి రికార్డుల దగ్గర వరకూ వెళ్తామని స్టేట్మెంట్లు ఇస్తుండగా.. కల్కి మూవీ RRR రికార్డులని బీట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు డైరెక్టర్ నాగ్ అశ్విన్, జక్కనలను కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

వెండితెర మీద విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తూ దర్శక ధీరుడు అనిపించుకున్నారు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' సినిమాతో ఓ ఇమేజినరీ ఫ్యూచర్ వరల్డ్ ని సృష్టించి, ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్ళబోతున్నారు. హిందూ పురాణాల స్పూర్తితో, తన విజన్ ను బిగ్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే లాంటి స్టార్ క్యాస్టింగ్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో హాలీవుడ్ రేంజ్ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేసారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో నాగి స్టామినా ఏంటనేది శాంపిల్ గా చూపించారు. ఇద్దరు దర్శకుల సామర్ధ్యాల గురించిన చర్చను పక్కన పెడితే, కొన్ని విషయాల్లో రాజమౌళి - నాగ్ అశ్విన్ ల మధ్య కొన్ని తేడాలు కనిపిస్తున్నాయి.

జక్కన్న ఎంతకష్టపడి సినిమా తీస్తారో, దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి అంతే కష్టపడతారు. కాస్త ఆలస్యమైనా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచీ అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. అనౌన్సమెంట్ అప్పుడే కథంతా వివరించి, సినిమాని ఎలా తీశారో చూడాలనే ఆసక్తిని జనాల్లో కలిగిస్తారు. ఒక్కటొక్కటిగా ప్రమోషనల్ కంటెంట్ ను వదులుతూ మార్కెటింగ్ చేస్తారు. మూవీ రిలీజ్ డేట్ లాక్ చేసిన తర్వాత, పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ చేస్తారు. దేశమంతా తిరుగుతూ, అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి కావాల్సిన బజ్ తీసుకొస్తారు.. ప్రెస్ మీట్లు పెట్టి, మీడియాలో సోషల్ మీడియాలో అందరూ తన మూవీ గురించే మాట్లాడుకునేలా చేస్తారు.

ఇక్కడ 'కల్కి 2898 AD' సినిమా విషయంలో నాగ్ అశ్విన్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. ప్రీ ప్రొడక్షన్ కోసమే చాలా టైం కేటాయించారు. సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత, ఒక్కరొక్కరుగా నటీనటుల పేర్లను రివీల్ చేస్తూ హైప్ తీసుకొచ్చారు. ఫస్ట్ లుక్, క్యారక్టర్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్లు వదులుతూ వచ్చారు. 'ది వ‌ర‌ల్డ్ ఆఫ్ క‌ల్కి' పేరుతో వీడియోలు వదులుతూ కల్కి కథేంటనేది వివరిస్తూ జనాల్లో ఆసక్తిని రెట్టింపు చేసారు. ముంబైలో ప్రెస్ మీట్ నార్త్ ఆడియన్స్ ని ఆకర్షించారు.

కాకపోతే రాజమౌళి మాదిరిగా నాగ్ అశ్విన్ దేశమంతా తిరుగుతూ ప్రమోషన్స్ చెయ్యలేదు. తెలుగులో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ప్రభాస్ మన మీడియా ముందుకు రాలేదు. అసలు హీరో హీరోయిన్లతో ఇంటర్వ్యూలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా నిర్వహించలేదు. తమిళ, మలయాళ, కన్నడ భాషల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా సరే ఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి' సినిమా గురించే చర్చ జరుగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ ప్రభంజనం సృష్టిస్తోంది.

తెలుగు నాట ఒక్క మీడియా మీట్ పెట్టకుండా, ప్రమోషన్ ఈవెంట్ చేయకుండా సినిమాకు ఇంత భారీ బజ్ తీసుకువచ్చారు. ఇవేమీ చేయకుండానే 'కల్కి' సినిమా గురించి మాట్లాడుకునేలా చేసారంటే.. ఈ విషయంలో రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ చాలా గ్రేట్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడే ఇద్దరు దర్శకుల మధ్య పోలికలు పెట్టడం తొందర అవుతుంది కానీ, ఓ మోస్తరు ప్రచార కార్యక్రమాలతోనే తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.