నాగి.. గతం వర్తమానం కాదని నిరూపిస్తేనే..!
ఇప్పుడు అలాంటి గుణపాఠాల తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఎడి' సంచలనాలు నమోదు చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2024 3:30 PM GMTగతం గతః.. వర్తమానంలో ఏం చేశామన్నది చాలా ముఖ్యం. గతంలోని విమర్శలను గుర్తుంచుకుని, వాటిని విశ్లేషించుకుని వర్తమానంలో తప్పులు చేయకుండా ఉండటం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరం. ఇప్పుడు అలాంటి గుణపాఠాల తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'కల్కి 2898 ఎడి' సంచలనాలు నమోదు చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి గొప్ప విజయం అందుకోవడమే గాక, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ సిరీస్ పిట్ట కథలులో 'ఎక్స్‌లైఫ్' కి అతడు చేసిన పని అందరినీ ఆకట్టుకోలేదు. సైన్స్ ఫిక్షన్ కథతో నాగి అప్పుడు కూడా ప్రయోగం చేసాడు కానీ అది అంతగా మెప్పించలేదు. ఎంపిక చేసుకున్న పాయింట్ బావున్నా .. నాగ్ ఊహాశక్తి ఆకట్టుకున్నా కానీ, ఎమోషన్ పరంగా వర్కవుట్ కాలేదని విమర్శలొచ్చాయి. అందుకే అలాంటి గతాన్ని రిపీట్ కానివ్వకుండా ఇప్పుడు కల్కి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఉంటాడని అంతా ఊహిస్తున్నారు.
గతం ఎప్పుడూ వర్తమానం కాకూడదు! యువ ఫిలింమేకర్స్ నేర్చుకున్న దాని నుంచి పరిణతితో అనుకున్నది సాధించాలి. సొంత మామగారు అశ్వనిదత్ బ్యానర్ తనకు అండగా నిలిచి కావాల్సినంత స్వేచ్ఛను ఇచ్చింది. అనవసరమైన కార్పొరెట్ ఆర్భాటాలు ఏవీ అడ్డంకి కావు .. పైగా తనకు కావాల్సిన సౌకర్యాలున్నాయి. సృజనాత్మక ప్రక్రియకు అడ్డంకులేవీ లేవు.. కాబట్టి నాగి తన క్రియేటివిటీని యథేచ్ఛగా అనుసరించి ఈసారి బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అంతా విశ్వసిస్తున్నారు.
భారతదేశంలో గతంలో కొన్ని సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చినా కానీ, ఇప్పుడు కల్కి 2898 AD వాటన్నిటినీ మించిన అసాధారణ ప్రయత్నం. ఇంచుమించు ఒక హాలీవుడ్ మూవీ కోసం ఎంచుకున్న కాన్వాస్ కనిపిస్తోంది. భారీతనం.. విజువల్ ఎఫెక్ట్స్ తో ఇది రంజింపజేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ విడుదలైన టీజర్, ట్రైలర్లతో అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అయితే నాగ్ అశ్విన్ అంచనాలను అందుకునేలా సినిమాని రూపొందించాడా లేదా? అన్నది తెలియాలంటే ఈనెల 27 వరకూ ఆగాలి. తుపాకి డాట్ కాం ఎక్స్ క్లూజివ్ రివ్యూ కోసం...
పిట్ట కథలు నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక చిన్న చిత్రం .. ఇది ఎవరినీ పెద్దగా ప్రభావితం చేయలేదు. కానీ కల్కి 2898 AD కి 600 కోట్లు ఖర్చు పెట్టారు .. ఈ సినిమాతో చాలా మంది కెరీర్లు పణంగా ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఈసారి తప్పు చేయలేడు. నాగ్ అశ్విన్ తన మునుపటి అనుభవం నుండి నేర్చుకున్నాడని మరియు కల్కి 2898 ADతో ఆకట్టుకునే మరియు భావోద్వేగాలను కలిగించే చిత్రాన్ని అందిస్తాడని మేము చాలా ఆశాజనకంగా ఉన్నాము.