Begin typing your search above and press return to search.

జనాల్ని ప్రిపేర్ చేస్తున్న కల్కి డైరెక్టర్!

'కల్కి 2898 AD' హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ.

By:  Tupaki Desk   |   21 Jun 2024 7:50 AM GMT
జనాల్ని ప్రిపేర్ చేస్తున్న కల్కి డైరెక్టర్!
X

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్ష‌న్ మూవీ "క‌ల్కి 2898 AD". అమితాబ్ బచ్చన్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనే, దిశా ప‌టానీ.. ఇలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఇందులో భాగం అయ్యారు. చాలా కాలంగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం, మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగ్ అశ్విన్ స్క్రీన్ మీదకు వచ్చి, తాము ఎలాంటి కంటెంట్ ను చూపించబోతున్నారనేది వివరిస్తూ జనాలను ముందే ప్రిపేర్ చేస్తున్నారు.

'కల్కి 2898 AD' హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన ఎపిక్ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ మూవీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఇది హలీవుడ్ రేంజ్ తీస్తున్న తెలుగు సినిమా అనే విధంగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌ లో ఫస్ట్ లుక్ & గ్లింప్స్ ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆడియన్స్ ను ఫ్యూచర్ వరల్డ్ లోకి తీసుకెళ్ళి, సరికొత్త అనుభూతిని పంచబోతున్నట్లు హింట్ ఇచ్చారు.

ముందుగా కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్ పోషిస్తున్న భైరవ, అశ్వద్ధామ పాత్రలను పరిచయం చేశారు. ఆ తర్వాత కథలో కీలకమైన పాత్రను 'బుజ్జి' అనే స్పెషల్ కార్ కు సంబంధించిన విషయాలను రివీల్ చేశారు. ఇదే క్రమంలో 'బుజ్జి అండ్ భైరవ' పేరుతో ఓ యానిమేటెడ్ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసి ఆసక్తిని రెట్టింపు చేశారు. ట్రైలర్ లో కథేంటనేది పెద్దగా రివీల్ చెయ్యలేదు కానీ, విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో శాంపిల్ గా చూపించారు.

'ది వ‌ర‌ల్డ్ ఆఫ్ క‌ల్కి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ వ‌రుస వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేస్తూ, సినిమాపై ఉత్కంఠ‌ను పెంచేస్తున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో అసలు కల్కి ఏంటి? దాని ముందు, వెనుక కథా కమామిషు ఏమిటి? అన్నది వివరించారు. మహాభారతం గురించి వివరిస్తూ, 'కల్కి 2898 ఏడీ' స్టోరీ పురాణాలు అన్నింటికీ క్లైమాక్స్ లాగా ఉంటుందని చెప్పారు. ఇక రెండో ఎపిసోడ్ లో ఈ కథంతా మూడు ప్రపంచాల మధ్య నడుస్తుందంటూ మరిన్ని ఆసక్తికరమైన విష‌యాల‌ను పంచుకున్నారు నాగి.

ఫ్యూచర్ వరల్డ్ ఎలా ఉంటుందో, ఇప్ప‌టి కాశీ న‌గ‌రం 3 వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎలా మారిందనేది ఊహించి తెరపై ఆవిష్క‌రించినట్లుగా నాగ్ అశ్విన్ చెబుతున్నారు. భవిష్యత్ లో జన జీవనం ఎలా ఉండబోతోంది, వారు తినే తిండి, కట్టుకునే బట్టలు, ఉప‌యోగించే వాహ‌నాలు.. ఇలా ప్రతీది వివరించే ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి మరికొన్ని ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త పోస్టర్లు వదులుతున్నారు. ఈరోజు సాయంత్రం వదిలే రిలీజ్ ట్రైలర్ ద్వారా 'కల్కి 2898 AD' లో యాక్షన్ ఎలా ఉండబోతోందనేది పైపైన చూపించబోతున్నారు.

ఇలా నాగ్ అశ్విన్ తన 'కల్కి వరల్డ్' ను ముందే జనాలకు పరిచయం చేస్తూ, దానికి అలవాటు చేస్తున్నారు. స్టోరీ బ్యాగ్రౌండ్ ను వివరిస్తూ సినిమాపై ఓ అవగాహన కలిగిస్తున్నారు. నిజానికి ఇది చాలా మంచి ఐడియా అనే చెప్పాలి. థియేటర్లలో ఏం చూడబోతున్నామనేది ఆడియెన్స్ కు ఓ ఐడియా ఉంటుంది.. దానికి తగ్గట్టుగా ఓ అంచనాకు వస్తారు. అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా తన సినిమాలకు సంబంధించి ఏదీ దాచకుండా చెబుతుంటారు. తాను ఏం చూపించబోతున్నానేది ముందే చెప్పి, ఎలా తీశాడు? ఏం తీశాడు? అనే ఆసక్తిని కలిగిస్తుంటారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందనేది జూన్ 27న తేలిపోతుంది.