టికెట్ ధరలు.. ఏది కరెక్టనేది ఎవరూ చెప్పలేం: నాగవంశీ
తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టికెట్ ధరల విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
By: Tupaki Desk | 27 Dec 2024 8:26 AM GMTటాలీవుడ్ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ.. ఏదైనా బల్లగుద్ది చెప్పినట్లే మాట్లాడుతుంటారు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి చెందిన పలు విషయాలపై స్పందిస్తుంటారు. తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు టికెట్ ధరల విషయంపై మాట్లాడారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సినీ ప్రియులను ఇబ్బందిపెట్టే ఉద్దేశం ఏ ప్రొడ్యూసర్ కు కూడా అస్సలు ఉండదని నాగవంశీ తెలిపారు. ఏ నిర్మాత అయినా తన సినిమాకు పెట్టిన ఖర్చు, బయ్యర్లకు అమ్మిన రేటు బట్టి టికెట్ కాస్ట్ ను డిసైడ్ చేసుకుంటారని అన్నారు. తాను నిర్మించిన దేవర సినిమాకు అంత ఖర్చు అయింది కాబట్టి.. ఇంత రేట్ కావాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు.
అదే ధర కావాలని ప్రభుత్వాలను కోరానని తెలిపారు నాగవంశీ. ఆ విధంగా పుష్ప-2 సినిమాకు కూడా నిర్మాతలు పెట్టిన ఖర్చుకు ఎంత ధర న్యాయ చేస్తుందనుకున్నారో అంతే అడిగారని చెప్పారు. ఎవరైనా కూడా సినిమా టికెట్ కాస్ట్ ల విషయంలో ఏది కరెక్ట్.. ఏది కరెక్ట్ కాదని చెప్పలేమని, ఒక్కో మూవీకి ఖర్చు ఒక్కోలా ఉంటుందన్నారు.
టికెట్ ధరల పెంపు వల్ల సినీ ప్రియులను ఇబ్బంది పెట్టాలని ఎవరూ అనుకోరని, ఆ ఉద్దేశం ఎవరికీ ఉండదని నాగవంశీ తెలిపారు. ఏడాదిలో రెండు మూడు సినిమాలకే ధరలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. 2024లో మూడు సినిమాలకే రేట్లు పెరిగాయని.. కల్కి, దేవర, పుష్ప-2 మాత్రమేనని సితార బాస్ అన్నారు.
అదే సమయంలో తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ల గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ మూవీ మార్చి 28వ తేదీన విడుదల చేయాలనుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయిందని చెప్పారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా కంప్లీట్ అయినట్లు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ ఫ్రీ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేస్తామని, అయితే సమ్మర్ లో ప్రారంభిద్దామని అనుకుంటున్నట్లు తెలిపారు. డాకు మహారాజ్ కథ బాలయ్యను దృష్టిలో పెట్టుకుని రాశారని చెప్పిన నాగవంశీ.. ఆయన మూవీలో డెకాయిట్ గా మారే ఎలివేషన్ హైలైట్ గా ఉంటుందని చెప్పి అంచనాలు పెంచారు. బాలయ్య కొత్త లుక్ లో ఉంటారని అన్నారు. నటసింహం సినిమా అంటే చాలు, తమన్ కు పూనకాలు వస్తాయంటూ నవ్వేశారు!