Begin typing your search above and press return to search.

కథ, స్క్రీన్‌ప్లే, దాని తొక్కా తోలు ఎవడు అడిగాడు?: నాగవంశీ

''ఒక సినిమాకి బ్యారియర్ రెవెన్యూ. రివ్యూలు కాదు. ఏదైనా సినిమా వచ్చినప్పుడు ట్విట్టర్, యూట్యూబ్ లేదా పాడ్ కాస్ట్ లలో దానిపై రివ్యూలు పెడుతుంటారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:30 PM GMT
కథ, స్క్రీన్‌ప్లే, దాని తొక్కా తోలు ఎవడు అడిగాడు?: నాగవంశీ
X

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. ఎలాంటి నిర్మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన నైజం. అందుకే మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడే మాటలు వైరల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు వివాదాస్పదంగానూ మారుతుంటాయి. ఇటీవల టికెట్ రేట్ల గురించి యువ నిర్మాత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎంత దుమారం రేపాయో మనం చూశాం. తాజాగా నాగవంశీ సినిమా రివ్యూలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

'లక్కీ భాస్కర్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్టుగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాగవంశీ. కరోనా తర్వాత ఆడియన్స్ ఆలోచనా విధానం మారిపోయిందని, పోస్టర్‌ లేదా టీజర్‌ ని బట్టి సినిమా చూడాలా? వద్దా? అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారని చెప్పారు. యూట్యూబ్ లో పెట్టే రివ్యూ వీడియోలు జనాల్ని ప్రభావితం చేయలేవని అభిప్రాయపడ్డారు. రివ్యూలతో సంబంధం లేకుండా తాము చూడాలనుకున్న సినిమాని చూస్తున్నారని అన్నారు. ఈరోజుల్లో ట్విటర్‌ రివ్యూలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పది పోస్టుల్లో ఐదు బాగుందని ఉంటే సినిమా సూపర్‌ హిట్ అయినట్లేనని తెలిపారు. అయితే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకులు మౌత్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారని అన్నారు.

''ఒక సినిమాకి బ్యారియర్ రెవెన్యూ. రివ్యూలు కాదు. ఏదైనా సినిమా వచ్చినప్పుడు ట్విట్టర్, యూట్యూబ్ లేదా పాడ్ కాస్ట్ లలో దానిపై రివ్యూలు పెడుతుంటారు. అసలు రివ్యూలు పెట్టమని ఎవడు అడిగాడు నిన్ను?. నీ ఒపీనియన్ నువ్వు పెడుతున్నావ్. దాని మీద రియాక్ట్ అయి చేసేది ఏముంది?. జనాలకు సినిమా నచ్చితే టికెట్ కొనుక్కొని చూస్తారు.. లేదంటే చూడరు. జనాల్ని ఎవరూ ఇన్ ఫ్లూయెన్స్ చెయ్యలేరు. సోషల్‌మీడియాలో మీరు పెట్టే రివ్యూ వీడియోలు చూసి జనాలు ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతారని అనుకుంటే, అది మీ పిచ్చి భ్రమ. ఒకటీ రెండు శాతం తప్పితే ఎవరూ వాటికి ప్రభావితం అవ్వరు. ఫన్ కోసం, ఎంత వెటకారంగా రివ్వ్యూలు చెప్పారో అని చూస్తారేమో కానీ.. ఆ వీడియో చూసి సినిమాకి వెళ్ళాలా వద్దా అని ఆడియన్ ఎప్పుడూ డిసైడ్ అవ్వడు'' అని నాగవంశీ చెప్పారు.

''ప్రేక్షకుడు ఒక సినిమా చూడాలని అనుకుంటే కచ్చితంగా చూస్తాడు. కోవిడ్ తర్వాత ఆడియన్స్ మనకంటే చాలా తెలివిగా ఉన్నారు. పోస్టర్‌ లేదా టీజర్‌ చూసే ఈ సినిమా చూడాలా వద్దా? అని డిసైడ్ చేస్తున్నారు. రివ్యూల కోసం వాళ్ళు వెయిట్ చేయడం లేదు. రివ్యూలు బాగాలేనంత మాత్రాన సినిమా చూడకుండా ఉండరు. చూడాలనుకున్న సినిమాను ఎలాగైనా చూస్తున్నారు. కమిటీ కుర్రాళ్లు, మ్యాడ్, ఆయ్ లాంటి చిన్న సినిమాల విషయంలో మాత్రం మౌత్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంతేకానీ వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ లలో రివ్యూల్లో ఏం చెప్పారో చూద్దాం అని ఎవరూ ఎదురుచూడటం లేదు. మౌత్ టాక్ అనేది చాలా పవర్ ఫుల్''

''పది పదిహేనేళ్ల క్రితం కూడా రివ్యూలు సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదని, కేవలం అర్బన్ ఏరియాలలో కొంతమంది మాత్రమే చూసేవాళ్ళని నాగవంశీ చెప్పారు. ''ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉండటం వల్ల సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ చూస్తున్నారు. వెబ్‌సైట్స్‌ యూట్యూబ్‌ రివ్యూస్ కంటే ట్విట్టర్, ఇంస్టాగ్రామ్స్ లో పెట్టే రివ్యూలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ట్విట్టర్ లో పది పోస్టులు వేస్తే, వాటిల్లో ఐదు బాగుందని పెడితే చాలు.. ఆ సినిమా సూపర్‌ హిట్టే. మిగతా ఐదు కావాలని బాగాలేదని వేస్తారు. ఎందుకంటే నెగెటివ్ వేస్తేనే రిజిస్టర్ అవుతారు. సినిమా బాగుందని పాజిటివ్ గా వేస్తే ఎవరూ నిన్ను పట్టించుకోరు. ఎంత బాగా హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ని తిట్టావ్ అంటేనే రిజిస్టర్ అవుతారు. ఆ యాంగ్జైటీతోనే అలా పోస్టులు పెడతారు. జనాలకు అది అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టదు''

''సినిమా చూసే విధానం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. 'సలార్' సినిమాని తీసుకుంటే, హీరో ప్రభాస్ 30-40 మందిని కొట్టాలనే ఎవరైనా కోరుకుంటారు. హీరోకి హై ఎలివేషన్స్ ఉండాలి.. హీరోయిజం చూపించాలి, బాగా డ్యాన్స్ చెయ్యాలి. ఫైట్స్ చెయ్యాలి. కామెడీ చెయ్యాలి అని కోరుకునే పెద్ద హీరోల సినిమాకి వెళతాం. ఆ అంశాలు ఉంటే చాలు కదా?. కథ, కథా బలం, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్కా తోలు ఎవడు అడిగాడు? అసలు అవన్నీ ఎవడికి కావాలి?'' అని నాగవంశీ అన్నారు. చిన్న సినిమాలకు మాత్రం ఇవన్నీ మ్యాటర్ అవుతాయని నిర్మాత అభిప్రాయపడ్డారు. రెండు గంటలపాటు స్క్రీన్ ప్లే లేదా ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్ ను థియేటర్లో కూర్చోబెట్టాలని అన్నారు. పెద్ద సినిమాలకు హీరో లేదా దర్శకుడిని చూసి ఆడియన్స్ వస్తారు కానీ.. చిన్న చిత్రాలకు మాత్రం కంటెంట్ చూసే వస్తారని నాగవంశీ చెప్పుకొచ్చారు.