నమ్రత మళ్లీనా?.. నమ్మేలా లేదే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే
By: Tupaki Desk | 9 July 2024 4:30 PM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి అందరికీ తెలిసిందే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత.. తనకంటూ స్పెషల్ క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత పలు అందాల పోటీల్లో పాల్గొని టైటిల్స్ ను కైవసం చేసుకుంది. 1998లో జబ్ ప్యార్ కిసీసే హోతా హై సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ సమయంలో అక్కడ స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది నమ్రత శిరోద్కర్.
అయితే బీ టౌన్ లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్ లో.. తెలుగులో మహేష్ బాబు వంశీ మూవీలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నమ్రత.. డెబ్యూ మూవీతో హిట్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత చిరంజీవి అంజిలో నటించింది. ఇక వంశీ సినిమా టైమ్ లో మహేష్ తో ప్రేమలో పడింది. రహస్యంగా ఇద్దరూ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు 2005లో మహేష్ బాబుతో ఏడడుగులు నడిచింది నమ్రత.
ఇక వీరిద్దరి వివాహ బంధానికి గుర్తుగా గౌతమ్, సితార జన్మించారు. అయితే పెళ్లి తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు నమ్రత. అనేక ఆఫర్లు వచ్చినా.. రిజెక్ట్ చేసింది. హీరోయిన్ రోల్ ను పక్కన పెట్టి.. ఫ్యామిలీకి పూర్తిగా పరిమితమైంది. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. డేట్స్, మూవీస్, యాడ్స్, డ్రెస్సింగ్, వ్యాపారాలు.. అలా అన్ని విషయాల్లో తన మార్క్ ను చూపిస్తోంది నమ్రత శిరోద్కర్.
అయితే ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న నమ్రతకు సంబంధించిన ఓ వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత.. ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రముఖ ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరో సినిమాలో నమ్రత కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో ఆమె కనిపించనుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వెల్ కమ్ బ్యాక్ మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది నిజం కాదని, నమ్మేలా లేదని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా నమ్రత రీఎంట్రీ గురించి చాలాసార్లు వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన ఆమె.. తనకు మళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆసక్తి లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఇప్పుడు మళ్లీ జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందిస్తుందో లేదో చూడాలి.