మోక్షజ్ఞ.. మెరుపులే!
నందమూరి మోక్షజ్ఞ పేరు కొన్ని నెలల ముందు వరకు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుండేది.
By: Tupaki Desk | 4 Feb 2025 5:16 PM GMTనందమూరి మోక్షజ్ఞ పేరు కొన్ని నెలల ముందు వరకు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుండేది. కానీ మధ్యలో ఉన్నట్లుండి అతను ఈ చర్చల్లోంచి పక్కకు వెళ్లిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అతను చేయాల్సిన తొలి చిత్రానికి.. ప్రారంభోత్సవం ముంగిట ఎందుకో బ్రేక్ పడింది. ముహూర్త వేడుకకు అంతా సిద్ధం చేశాక మోక్షజ్ఞ ఇంకా రెడీగా లేడంటూ ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
దీంతో బాలయ్య తనయుడి అరంగేట్రం గురించి మళ్లీ అయోమయం నెలకొంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి చర్చే లేదు. మోక్షజ్ఞ కూడా ఎక్కడా కనిపించలేదు. తన తొలి చిత్రం సంగతేంటో క్లారిటీ లేకపోయింది. ఐతే కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తన కొత్త లుక్ తాలూకు వీడియో బయటికి రావడమే ఇందుక్కారణం.
బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిన నేపథ్యంలో ఆయన సోదరి భువనేశ్వరి ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తాలూకు వీడియోలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. అందులో ఒక వీడియోలో మోక్షజ్ఞ తళుక్కుమన్నాడు. బాగా పెంచి స్టైలింగ్ చేయించిన జట్టు.. లైట్ గడ్డంతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ ఇందులో.
ఓవరాల్‌గా ఫిజిక్ కూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తోంది. ఈ చిన్న వీడియోనే నందమూరి అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తోంది. పర్ఫెక్ట్ లుక్‌తో మోక్షజ్ఞ తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడంటూ ఎలివేషన్లు ఇస్తున్నారు సోషల్ మీడియా ఫ్యాన్స్. ప్రశాంత్ వర్మతో అతను చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ మధ్యలో ఓ ప్రచారం నడిచింది కానీ.. అదేమీ లేదని తెలుస్తోంది. త్వరలోనే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని.. ఈలోపు ముహూర్త వేడుక గురించి అప్‌డేట్ బయటికి రావచ్చని అంటున్నారు.