ఆ విషయంలో బాలయ్య ముందడుగు వేశారు
సీనియర్స్ నిజం తెలుసుకున్నారా?. వయసుకు తగ్గ పాత్రల్లో నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవునని తెలుస్తోంది
By: Tupaki Desk | 9 Oct 2023 6:32 AM GMTసీనియర్స్ నిజం తెలుసుకున్నారా?. వయసుకు తగ్గ పాత్రల్లో నటించడానికి రెడీ అవుతున్నారా? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవునని తెలుస్తోంది. అంతే కాకుండా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచిన సినిమాలు కమల్ 'విక్రమ్', రజనీకాంత్ 'జైలర్', షారుక్ ఖాన్ 'జవాన్' ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి కూడా. ఇంతకీ సీనియర్స్ తెలుసుకున్న నిజం ఏంటీ?.. ఈ విషయంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ముందడుగు ఎలా వేశారు? ఆ కథా కమామీషు ఏంటన్నది ఓ లుక్కేద్దాం.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వయసుకు తగ్గ పాత్రతో ముందకొచ్చి ప్రేక్షకుల ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకు హీరోయిన్‌లతో డ్యాన్స్‌లు చేస్తూ 35, 40 ఏళ్ల హీరోగా కనిపించిన కమల్ 'విక్రమ్' సినిమాలో మాత్రం తొలి సారి తన వయసుకు తగ్గ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తండ్రిగా, తనయుడిని హత్య చేసిన వారిపై పగతీర్చుకునే తండ్రిగా, ప్రత్యర్థుల నుంచి మనవడిని కాపాడుకునే తాతయ్యగా కమల్ కనిపించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో 'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలచి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది.
ఇదే తరహాలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ట్రై చేశారు. సక్సెస్ అందుకున్నారు. రజనీ అంటే ఓ స్టైల్. పూనకాలు తెచ్చించే మబాస్‌మేనియా. అయితే ఆయన గత కొంత కాలంగా తన మార్కు సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోయారు. ఆ లోటుని తీరుస్తూ రజనీ చేసిన సినిమా 'జైలర్'. అప్పటి వరకు యంగ్ హీరోగా కనిపించిన రజనీ ఈ సినిమాలో మాత్రం వయసుకు తగ్గ పాత్రలో తండ్రిగా, తాతగా కనిపించి ఆకట్టుకున్నారు. దీంతో 'జైలర్' బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది.
రజనీకి తిరుగులేని విజయాన్ని అందించింది. ఇప్పుడు ఇదే పంథాని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఫాలో అవుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సీనియర్ హీరోల్లో ఈ విషయంలో బాలయ్య ముందడుగు వేశారని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి రూపొందించిన ఈ మూవీలో బాలయ్య తన వయసుకు తగ్గ పాత్రలో నటించారు. శ్రీలీలకు బాబాయ్‌గా కనిపించి తన వయసుకు తగ్గ పాత్రని పోషించారు. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లలోనే దీన్నే ప్రధానంగా చూపించారు.
పరిణతి గల తండ్రిగా, తన కూతురు వ్యవస్థలో ధైర్యంగా నిలబడాలని తపించే చిచ్చాగా బాలయ్య పాత్రని దర్శకుడు అనిల్ రావిపూడి ఇందులో మలిచారు. దీంతో 'భగవంత్ కేసరి' టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అభిమానుల్లోనూ ఈ సినిమాపై సరికొత్త చర్చ మొదలైంది. అంతే కాకుండా బాలయ్య తొలి సారి తండ్రి పాత్రలో నటించడంతో టాలీవుడ్ లో కొత్త చర్చకు తెర తీసింది. అక్టోబర్ 19న విడుదలవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇదే తరహా సినిమాలకు మరిన్ని రావడం మొదల్యే ట్రెండ్ స్టార్టవుతుంది.