బాలయ్య@50.. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు రెడీ!
ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నటసింహాన్ని ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 12 July 2024 3:56 AM GMTటాలీవుడ్ సీనియర్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రి పేరు నిలబెడుతూ ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే వచ్చే నెలతో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఆగస్టు 30వ తేదీకి ఆయన తొలి సినిమా వచ్చి సరిగ్గా యాభై ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరపున నటసింహాన్ని ఘనంగా సన్మానించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో 'తాతమ్మ కల' అనే సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆయన తండ్రి ఎన్.టి.రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, ప్రధాన పాత్రలో నటించారు. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు సొంతంగా నిర్మించారు. ఇందులో నందమూరి హరికృష్ణతో పాటుగా భానుమతి రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. అంటే వచ్చే నెలాఖరుకి నటుడిగా బాలయ్య 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు.
ఎప్పటికప్పుడు నూతన నటీనటులు పరిచయమయ్యే సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. బాలయ్య సమకాలీన హీరోలు చాలామంది సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్, నెగెటివ్ క్యారెక్టర్లు చేస్తుంటే.. ఆయన మాత్రం ఇప్పటికీ కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది గొప్ప విషయమనే చెప్పాలి. అందుకే అలాంటి అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణను సత్కరించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయించింది.
ఇటీవల కెఎల్ దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్, టి. ప్రసన్న కుమార్, వల్లభనేని అనిల్ వంటి కొందరు ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను కలిసి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం ఆయన్ను ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారని తెలుస్తోంది. దీనికి భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఇకపోతే హీరోగా సక్సెస్ ఫుల్ గా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న నందమూరి బాలకృష్ణ.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికై, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలను బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా సేవలు అందిస్తూ, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. బాలయ్య తన 50 ఏళ్ల సినీ కెరీర్ లో ఇప్పటి వరకూ 108 సినిమాలలో నటించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'NBK 109' చిత్రంలో నటిస్తున్నారు.