డెబ్యూ మోక్షజ్ఞ పాన్ ఇండియా ట్రయల్?
బాహుబలి, సైరా నరసింహా రెడ్డి, ఆర్.ఆర్.ఆర్, హనుమాన్ .. ఈ సినిమాలన్నిటిలో కామన్ ఎలిమెంట్ 'సూపర్ హీరోయిజం'
By: Tupaki Desk | 19 Aug 2024 4:28 AM GMTబాహుబలి, సైరా నరసింహా రెడ్డి, ఆర్.ఆర్.ఆర్, హనుమాన్ .. ఈ సినిమాలన్నిటిలో కామన్ ఎలిమెంట్ 'సూపర్ హీరోయిజం'. సూపర్ హీరోలను తెరపై చూపించి ఔరా! అనిపిస్తున్నారు మన దర్శకులు. ఎంపిక చేసుకున్న పాత్రకు సూపర్ హీరోయిజాన్ని జోడించి భారీ యాక్షన్ కి ఆస్కారం కల్పించడం ద్వారా మాస్ ని పదే పదే థియేటర్లకు రప్పిస్తున్నారు.
ఇప్పుడు అదే తీరుగా మోక్షజ్ఞను తెరపై పరిచయం చేసేందుకు హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ చేస్తున్ప ప్రయత్నం ఆసక్తిని కలిగిస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడిని పరిచయం చేయడం అంటే ఆషామాషీనా? సరైన సమయంలో సరైన దర్శకుడితో ముందుకు వెళ్లాలనే బాలయ్య బాబు నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. హనుమాన్ తో పాన్ ఇండియా హిట్టు కొట్టిన ప్రశాంత్ వర్మకు ఈ అవకాశం ఇవ్వాలనే నిర్ణయం సముచితమైనదన్న భావన నందమూరి అభిమానుల్లోను ఉంది.
ఒక రెగ్యులర్ మాస్ డైరెక్టర్ చేతికి మోక్షజ్ఞను అందించి ఉంటే కచ్ఛితంగా అది విమర్శలకు తావిచ్చేది. కానీ బాలయ్య బాబు ఎంతో తెలివిగా మోక్షు ఆరంగేట్ర చిత్రాన్ని ప్లాన్ చేసారు. మొదట్లో ఆదిత్య 369 సీక్వెల్ తీస్తారని, దానికి బాలకృష్ణ డైరెక్టర్ అంటూ ప్రచారం సాగినా, దానికి బ్రేక్ ఇచ్చిన హనుమాన్ తో ట్రెండింగ్ లో ఉన్న దర్శకుడిని ఆశ్రయించడం ఒక గొప్ప ఎత్తుగడగా భావిస్తున్నారు.
మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి ఎప్పటికప్పుడు లీకులు అందుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్ కథానాయికగా నటిస్తుందని గుసగుసలు వినిపించాయి. ఖుషి కపూర్ తో చర్చలు సాగుతున్నాయన్న సమాచారం ఉంది. ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో నటిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్, శాండల్వుడ్ నుంచి పేరున్న స్టార్లను తీసుకునే అవకాశం ఉందంటూ..! మరో గుసగుస వినిపిస్తోంది.
హనుమాన్ ఫేం ప్రశాంత్ వర్మ క్రేజీ ప్రాజెక్టుకి ప్రధాన అస్సెట్ కానుండగా, ఖుషి, బాలీవుడ్ హీరో, ఇతర పరిశ్రమల స్టార్లు పాన్ ఇండియా అప్పీల్ తెస్తారని భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా కొనసాగుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారతీయ పురాణేతిహాసాల నుంచి ఒక ఆసక్తికరమైన పాత్రను తీసుకుని అందులో మోక్షజ్ఞను ప్రవేశ పెడుతున్నారు. అతడిని సూపర్ హీరోగా తెరపై చూపిస్తారు. మోక్షజ్ఞ పాత్రకి గురువు పాత్రలో సీనియర్ బాలీవుడ్ హీరో నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రయత్నం బావుంది. అంతకంతకు ఉత్కంఠ పెంచుతోంది. కానీ కెరీర్ ఆరంగేట్రమే భారీ స్పాన్ తో ఉంటే అది డెబ్యూ హీరోకి సవాల్ గా మారే ఛాన్సుంటుందేమో!