Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌గురువు మోక్ష‌జ్ఞ‌కు రాటు దేలే శిక్ష‌ణ‌?

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:42 AM GMT
ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌గురువు మోక్ష‌జ్ఞ‌కు రాటు దేలే శిక్ష‌ణ‌?
X

నందమూరి న‌ట‌వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం మిస్ట‌రీలా మారింద‌ని చాలా కాలంగా నందమూరి అభిమానులు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. 2018లో తొలిసారి మోక్షు డెబ్యూ గురించి విస్త్ర‌తంగా చ‌ర్చ సాగినా ఇప్ప‌టివ‌ర‌కూ అత‌డి ఎంట్రీ నీటి మూట‌లా మారింద‌నేది ఆవేద‌న‌. ఆ త‌ర్వాతా యేటేటా అత‌డి ఎంట్రీ గురించిన క‌థ‌నాలు టాలీవుడ్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. రెండేళ్లుగా మోక్షజ్ఞ తండ్రి బాలకృష్ణ సహా పలువురు ప్రముఖ టాలీవుడ్ దర్శకుల పేర్లతో మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ను ముడిపెట్టి వార్త‌లు వెలువడుతూనే ఉన్నాయి. ఎన్బీకే న‌టించిన ఆదిత్య 369 సీక్వెల్ క‌థ‌తో ఆదిత్య 999 మ్యాక్స్ తెర‌కెక్క‌నుంద‌ని, ఈ చిత్రంతోనే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని బాల‌కృష్ణ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. గ‌త ఏడాది అత‌డి సినీప్ర‌వేశం ఉంటుంద‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చినా ఏవీ నిజం కాలేదు. ఎట్ట‌కేల‌కు న‌ట‌వార‌సుడు తన నటనా రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ వైజాగ్‌లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రముఖ యాక్టింగ్ గురు సత్యానంద్ గ‌తంలో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ తారలకు నటనలో శిక్ష‌ణ‌ను అందించారు. మోక్షజ్ఞను ఆయ‌న చ‌క్క‌గా తీర్చిదిద్దుతున్నార‌ని తెలుస్తోంది. నటన శిక్షణతో పాటు, మోక్షజ్ఞ తన శారీరక పరివర్తనపై కూడా పని చేస్తున్నాడు. ఇటీవల అత‌డి మారిన రూపం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మోక్షు స్లిమ్ గా మారుతున్నాడు. హీరోయిక్ అప్పియ‌రెన్స్ కోసం చాలా త్యాగాలు చేస్తున్నాడ‌ని స‌మాచారం.

ఐదేళ్లుగా మోక్షు తెరంగేట్రంపై క‌థ‌నాలొస్తున్నా ఏవీ నిజం కాక‌పోవ‌డంతో అత‌డిపై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగింది. మోక్ష‌జ్ఞ‌కు న‌ట‌న అంటే ఆస‌క్తి లేద‌ని ప్ర‌చారం సాగింది. అందుకే అత‌డు త‌న రూపాన్ని మెయింటెయిన్ చేయ‌డు. దేనినీ స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి. కానీ మారిన స‌న్నివేశంలో అత‌డు పూర్తిగా న‌టుడు అయ్యేందుకు త‌న‌ను తాను మార్చుకుంటున్నాడ‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.