'మాస్' కోసం 'ఫ్యామిలీ' త్యాగం.. నాని కరెక్టేనా?
మాస్‌లో మాత్రం రీచ్ తక్కువగా ఉండేది. చాలా ఏళ్ల పాటు ఇదే అభిప్రాయం కొనసాగింది. కానీ గత కొన్నేళ్లలో నాని మేకోవర్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు.
By: Tupaki Desk | 4 March 2025 11:00 PM ISTనేచురల్ స్టార్ నానికి ఎప్పుడో స్టార్ ఇమేజ్ వచ్చినా.. అతను పక్కా క్లాస్ అనే ముద్రే పడిపోయింది. తనకు ఫ్యామిలీస్‌లో, క్లాస్ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ వచ్చినా.. మాస్‌లో మాత్రం రీచ్ తక్కువగా ఉండేది. చాలా ఏళ్ల పాటు ఇదే అభిప్రాయం కొనసాగింది. కానీ గత కొన్నేళ్లలో నాని మేకోవర్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ‘ఎంసీఏ’లో అతడికి మాస్ ఎలివేషన్లు పడ్డాయి. ఫైట్లు కూడా కొంచెం గట్టిగానే చేశాడు. ఆ తర్వాత ‘దసరా’తో నాని పెద్ద షాకే ఇచ్చాడు. అందులో నాని క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, లుక్ అన్నీ కూడా మారిపోయాయి. నేచురల్ స్టార్‌ను అంత మాస్‌గా అప్పటిదాకా ఎవ్వరూ చూపించలేదు. నాని చిత్రంలో అంత వయొలెన్స్ ఉండడం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మాస్‌లో నానికి ఆ సినిమా రీచ్ పెంచింది. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సినిమాను ఆశించిన స్థాయిలో చూడలేదనే చర్చ కూడా జరిగింది. ఐతే ‘హాయ్ నాన్న’తో వాళ్లకు కావాల్సింది ఇచ్చేశాడు నాని.
‘సరిపోదా శనివారం’ ఇటు మాస్, అటు క్లాస్ ఆడియన్స్‌కు నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా అది ఓకే అనిపించింది. కానీ ఇటీవల రిలీజైన నాని కొత్త చిత్రాల ప్రోమోలు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను కంగారెత్తించేశాయి. ‘హిట్-3’లో వయొలెన్స్ చూసి వామ్మో అనుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇంత వయొలెన్స్ భరించలేం అనుకున్నారు ఆ వర్గం. ఇక లేటెస్ట్‌గా వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో బూతు డైలాగులకు ఆ వర్గం బెంబేలెత్తిపోయింది. బూతులను నార్మలైజ్ చేయడం గురించి ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. టీజర్లనే ఇలాంటి బూతులు పెడితే.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. ఫ్యామిలీ ఆఢియెన్స్ ఎలా థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడగలరో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంకెవరి సినిమాలోనో ఇలా ఉంటే ఏమో కానీ.. నాని లాంటి ఫ్యామిలీస్ మెచ్చే హీరో చిత్రం ఇంత ఘాటుగా ఉండడం ఏంటి అంటున్నారు. ఐతే బోల్డ్ కంటెంట్‌కు బాగా అలవాట పడ్డ ఈ తరం యువతకు, మాస్‌కు ఈ టీజర్ బాగానే ఎక్కేసింది. వాళ్లు టీజర్ చూసి ఊగిపోతున్నారు. కానీ మాస్‌లో రీచ్ కోసం నాని ఫ్యామిలీ ఆడియన్స్‌ను దూరం చేసుకుంటున్నాడని, ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.