Begin typing your search above and press return to search.

Happy Birthday Nani: మొదటి జీతం.. టాప్ 10 గ్రాస్ కలెక్షన్స్!

అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన సినీ ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరో వరకు వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 5:30 AM GMT
Happy Birthday Nani: మొదటి జీతం.. టాప్ 10 గ్రాస్ కలెక్షన్స్!
X

తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన నటన, నేచురల్ అప్రోచ్, విభిన్నమైన కథలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నాని ఈరోజు (ఫిబ్రవరి 24) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన సినీ ప్రయాణం ఇప్పుడు స్టార్ హీరో వరకు వచ్చింది. ఈ టాలెంటెడ్ నటుడు, ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు. తన కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించి, సాలీడ్ రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరిన నాని, కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ తన సత్తా చాటుతున్నారు.

నాని సినీ కెరీర్ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా 4000 రూపాయల పారితోషికంతో మొదలు పెట్టిన నాని బాపు లాంటి దిగ్గజ దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా పనిచేశారు. చిన్నతనం నుండి సినిమాల పట్ల ఉన్న ఆసక్తితో ఆయన సినీ పరిశ్రమలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయాణంలో ప్రముఖ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా (2008) ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. కేవలం 1.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ సాధించింది. ఆ సినిమా నానికి మంచి గుర్తింపు తెచ్చి, వరుస అవకాశాలను అందించింది.

అష్టా చమ్మా సినిమాతో నటుడిగా మారిన నాని, క్రమంగా తన కెరీర్‌ను స్థిరపరుచుకుంటూ స్టార్ హీరోగా ఎదిగారు. అలా మొదలైంది, ఎవడే సుబ్రహ్మణ్యం, పిల్ల జమిందార్, భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, ఎంసీఏ, నానీ లోకల్ వంటి వరుస విజయాలు నానీని ప్రేక్షకులకు మరింత చేరువ చేశారు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలు నాని కెరీర్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లాయి.

తన మొదటి సినిమాలో కేవలం కొన్ని వేల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న నాని, ఇప్పుడు సినిమాకు 20 కోట్లు పైగా పారితోషికం అందుకుంటున్నాడంటే, అది ఆయన కష్టానికి, డెడికేషన్‌కు నిదర్శనం. ఇక 2023లో నాని తన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్ దసరా ద్వారా సాధించారు. ఈ సినిమా 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది, కానీ 115 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో నాని కెరీర్‌లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ మూవీగా నిలిచింది. ఈ విజయం నానీని మాస్ హీరోగా మార్చేసింది.

మొదట ఫ్యామిలీ ఆడియెన్స్, క్లాస్ ఆడియెన్స్‌కు చేరువైన నాని, దసరా ద్వారా మాస్ ఇమేజ్‌ను కూడా సంపాదించుకున్నారు. ఆ తరువాత వచ్చిన హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. ఇప్పటివరకు హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు హిట్ 3, ది ప్యారడైజ్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే మరో ప్యాన్ ఇండియా మూవీతో నాని తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.

హిట్ 3 చిత్రం మే 1 విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పుడు నాని కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు. దసరా హిందీలో కూడా బాగా ఆడటంతో, నాని సినిమాలకు నార్త్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ విజయాల నేపథ్యంలో నాని తన తదుపరి ప్రాజెక్ట్స్‌ను ప్యాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు.

తన 16 ఏళ్ల సినీ ప్రయాణంలో నాని ఎన్నో విజయాలను సాధించారు. వాటిలో టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలు ఈ విధంగా ఉన్నాయి:

1. దసరా - 115.3 కోట్లు

2. ఈగ - 103 కోట్లు

3. సరిపోదా శనివారం - 100.2 కోట్లు

4. హాయ్ నాన్న - 75.5 కోట్లు

5. ఎంసీఏ - 70 కోట్లు

6.నేను లోకల్ - 60 కోట్లు

7. నిన్ను కోరి - 55 కోట్లు

8. జెర్సీ - 53 కోట్లు

9. శ్యామ్ సింగ రాయ్ - 52 కోట్లు

10. భలే భలే మగాడివోయ్ - 51 కోట్లు

నాని తన కష్టం, టాలెంట్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, కేవలం తన ప్రతిభతో స్టార్ హీరోగా ఎదిగిన నాని ఈ బర్త్ డే తర్వాత మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్వరలో రాబోయే హిట్ 3, ది ప్యారడైజ్, శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్ సినిమాలు నాని కెరీర్‌లో మరొక మైలురాయి అవుతాయని అందరూ ఆశిస్తున్నారు.

హ్యాపీ బర్త్‌డే నాని!