కోర్టు బాలేకపోతే హిట్3 చూడకండి.. నాని సంచలన కామెంట్స్
రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిని ప్రధాన పాత్రల్లో నటించగా దీప్తి గంటా, ప్రశాంతి తిపిర్నేని కోర్టును నిర్మించారు.
By: Tupaki Desk | 8 March 2025 10:38 AM ISTకెరీర్ బిగినింగ్ నుంచే ఒక మంచి సినిమాను ఆడియన్స్ లోకి ఎలా తీసుకెళ్లాలి? దాన్ని ఎలా ప్రమోట్ చేయాలనే విషయంలో నాని భిన్నంగా ఆలోచిస్తూ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో రూపొందిన కోర్టు సినిమా మార్చి 14న థియేటర్లలోకి రానుంది.
రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, రోహిని ప్రధాన పాత్రల్లో నటించగా దీప్తి గంటా, ప్రశాంతి తిపిర్నేని కోర్టును నిర్మించారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను లాంచ్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు డైరెక్టర్లు నాగ్ అశ్విన్, శ్రీకాంత్ అడ్డాల, శైలేష్ కొలను, ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ, దేవ కట్టా గెస్టులుగా హాజరై, చిత్ర యూనిట్ కు సినిమా సక్సెస్ అవాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ ఈవెంట్ లో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, బలగం లాంటి సూపర్ హిట్ తర్వాత తాను ఎలాంటి సినిమా చేయాలని కన్ఫ్యూజ్ అయి నానిని సలహా అడిగానని, కోర్టు మూవీ రూపంలో నాని తనకు మంచి దారి చూపించాడని పేర్కొన్నాడు. కోర్టు చూశాక అందరూ ఇంప్రెస్ అవుతారని, ఇది చాలా ఇంటెన్స్ కోర్టు డ్రామా అని ప్రియదర్శి చెప్పాడు.
ఇక నాని కోర్టు సినిమా గురించి మాట్లాడుతూ చాలా గర్వంగా ఫీలయ్యాడు. కోర్టు సినిమాలో పని చేసిన వాళ్లంతా సూపర్ టాలెంట్ అని చెప్పిన నాని, ఇలాంటి కోర్టు రూమ్ డ్రామాలు తెలుగులో చాలా అరుదుగా వస్తాయని, ప్రతీ ఒక్కరూ థియేటర్లో ఈ సినిమాను మిస్ అవకుండా చూడాలని కోరారు. తాను నిర్మాతగా ఈ మాట చెప్పడం లేదని, సినిమా చూశాక ఓ ఆడియన్స్ గా తాను సినిమాకు చాలా కనెక్ట్ అయ్యానని తెలిపాడు.
మనం ఎన్నో సినిమాలు చూస్తే అందులో కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని శాటిస్‌ఫై చేస్తాయని, అందులో కోర్టు కూడా ఒకటిగా నిలుస్తుందని, కోర్టు చూశాక నేను చెప్పింది తప్పు అనిపిస్తే మరో రెండు నెలల్లో తను చేస్తున్న హిట్3 సినిమా చూడొద్దని నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తన కెరీర్లో ఎప్పుడూ ఆడియన్స్ ను ఈ సినిమా తప్పకుండా చూడండని చెప్పలేదని, ఈ సినిమాకు చెప్తున్నాననంటే కోర్టు ఎంత గొప్ప సినిమానో అర్థం చేసుకోవాలని నాని అన్నాడు. కోర్టు సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ థియేటర్ నుంచి ఓ మంచి సినిమా చూశామనే గర్వంతో బయటకు వస్తారని నాని చెప్పాడు. ఇవన్నీ చూశాక నాని ఈ సినిమాపై విజయంపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని అర్థమవుతుంది.