Begin typing your search above and press return to search.

కోర్ట్ బాక్సాఫీస్.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..

సాధారణంగా ఇలాంటి కోర్ట్ డ్రామా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదట నెమ్మదిగా ప్రారంభమవుతాయి.

By:  Tupaki Desk   |   15 March 2025 11:23 AM IST
కోర్ట్ బాక్సాఫీస్.. మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
X

తెలుగు చిత్త పరిశ్రమలో హీరోలుగా ఉంటూ నిర్మాతగా సక్సెస్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ అలాంటి నటుల్లో నాని ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకెళ్తోంది. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్స్ నెంబర్లు పెరుగుతున్నాయి. సాధారణంగా ఇలాంటి కోర్ట్ డ్రామా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మొదట నెమ్మదిగా ప్రారంభమవుతాయి.


అయితే కోర్ట్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. సినిమా విడుదలకు ముందే ప్రత్యేకంగా ప్రెస్ షోలు, పేడ్ ప్రీమియర్లు ఏర్పాటు చేయడంతో వర్డ్ ఆఫ్ మౌత్ సెన్సేషన్‌గా మారింది. ఈ వ్యూహం సినిమాకు తొలి రోజే మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలిగింది. అందులోనూ హోలీ పండగ సందర్భంగా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులు తక్కువగా ఉంటారు. కానీ కోర్ట్ మాత్రం ఈ ట్రెండ్‌ను బద్దలుకొట్టింది.

ప్రీమియర్స్, అలాగే డే 1 కలిపి రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీలో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. కంటెంట్‌కు పెద్దపీట వేసి తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజే ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషం. సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ కీలకపాత్రల్లో నటించగా, వారి పెర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ముఖ్యంగా శివాజీ విలన్‌గా అదరగొట్టాడని, ఒక కొత్త కోణంలో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడని అంటున్నారు. ఎమోషన్, లాయర్స్ మధ్య ఇన్‌టెన్స్ డైలాగ్ డెలివరీలు సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. సినిమా బుకింగ్స్ విషయానికి వస్తే, కోర్ట్ 24 గంటల్లో 1.21 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్ మై షోలో టాప్ ట్రెండింగ్ మూవీగా నిలిచింది. ఈ స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం అంటే మాటలు కాదు.

కేవలం ఓటీటీ బాట పట్టే చిన్న సినిమాలుగా భావించిన సినిమాలకు ఇది మంచి నమ్మకాన్ని కలిగించింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రేక్షకులు ఎంతగా ఆసక్తి చూపిస్తున్నారనే దానికి కోర్ట్ తాజా ఉదాహరణ. వీకెండ్ వసూళ్లు కూడా ఇదే స్థాయిలో ఉండేలా ఉన్నాయి. రెండో రోజు, మూడో రోజు బుకింగ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్‌కు దగ్గరగా ఉన్నాయి. ప్రీమియర్స్‌తో మొదటి రోజే సాలిడ్ కలెక్షన్లు వచ్చిన ఈ సినిమా, మౌత్ టాక్ బలంగా ఉండటంతో మరింత లాంగ్ రన్ కోసం రెడీ అవుతోంది.