‘కోర్ట్’ సక్సెస్.. నాని మరో బిగ్ ప్లాన్ రెడీ!
నాని నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందుకుంది.
By: Tupaki Desk | 16 March 2025 4:00 PM ISTనాని నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని అందుకుంది. ఓటీటీ కాలంలో కోర్ట్ రూమ్ డ్రామా థియేటర్‌లో సక్సెస్ అవుతుందా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సినిమా విడుదలకు ముందే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ రికవరీ అయిపోయిన ఈ చిత్రం, థియేట్రికల్ వసూళ్ల రూపంలో మరింత లాభాలను అందిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో వసూళ్లు అదిరిపోతున్నాయి.
ఇక నాని ఇప్పటికే నిర్మాతగా తన మార్క్ చూపించాడని ఇండస్ట్రీ అంటోంది. గతంలో ‘అ!’, ‘హిట్’ లాంటి సినిమాలను సమర్పించిన నాని, ఇప్పుడు కోర్ట్‌తో మరో క్రేజీ ఫ్రాంచైజీని మొదలుపెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో నాని ‘కోర్ట్’కు సీక్వెల్ ఉండొచ్చు’ అనే హింట్ ఇవ్వడం, ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది. కథ పరంగా సీక్వెల్ తీసే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, పాన్ ఇండియా రేంజ్‌లో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ జరుగుతోందట.
సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలకు లాంగ్ రన్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘హిట్’ ఫ్రాంచైజీ తరహాలో ‘కోర్ట్’ను కూడా సిరీస్‌గా తీసుకెళ్లే స్కోప్ ఉంది. మొదటి పార్ట్‌లో ఫోక్సో పాయింట్ చుట్టూ కథ నడవగా, సీక్వెల్‌లో మరో కొత్త లీగల్ థ్రిల్లర్ అంశాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. లాయర్ పాత్ర అదే కొనసాగుతూ, కేసు మాత్రం పూర్తిగా కొత్తగా ఉండనుంది. కథ, డ్రామా మారినా, దర్శకుడు మాత్రం మారకపోవచ్చు.
ఈ సక్సెస్‌ను నాని సరైన విధంగా క్యాష్ చేసుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కోర్ట్ దర్శకుడు రామ్ జగదీష్ ను మరో సినిమా కోసం లాక్ చేసేశారని సమాచారం. అయితే వెంటనే కోర్ట్ 2 చేయాలా లేక ముందుగా ఒక కమర్షియల్ సినిమా చేసి, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలా అనే దానిపై చర్చ జరుగుతోందట. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై మరో భారీ సినిమా చేస్తున్న తర్వాతే కోర్ట్ సీక్వెల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే కోర్ట్ మూవీ కలెక్షన్లు ట్రేడ్ వర్గాలు అనుకుంటున్న దాని కంటే బెటర్‌గా నమోదవుతున్నాయి. మొదటి మూడు రోజులు హౌస్‌ఫుల్‌తో దూసుకెళ్లిన కోర్ట్, వర్కింగ్ డేస్‌లో కూడా నిలదొక్కుకుంటోంది. మౌత్ టాక్ బలంగా ఉన్న కారణంగా వీకెండ్‌లో మరోసారి జోరు చూపించే అవకాశం ఉంది. దాంతో, కోర్ట్ సీక్వెల్‌పై ఇంకా స్పష్టత రాకముందే, దాని బిజినెస్ ఎలాగో ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. అదే జరిగితే ‘హిట్’ తర్వాత నాని సొంతంగా క్రియేట్ చేసే మరో ఫ్రాంచైజీ ‘కోర్ట్’ అవుతుందా అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకనుంది.