నాని వాల్ పోస్టర్.. ప్రియదర్శితో కోర్ట్ కథ
ఇదివరకే అ! - హిట్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 30 Aug 2024 6:55 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కాన్సెప్ట్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుండి మరో ప్రత్యేక చిత్రం రాబోతోంది. ఎప్పుడూ కంటెంట్‌కి ప్రధాన ప్రాధాన్యం ఇచ్చే ఈ నిర్మాణ సంస్థ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. హీరో నాని ఈ బ్యానర్ నుండి వస్తున్న సినిమాలను సపోర్ట్ చేస్తూ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇదివరకే అ! - హిట్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుండి ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి ఒక న్యాయవాది పాత్రలో కనిపించనున్నాడు. కథ మొత్తం ఒక నిర్దోషి బాలుడి చుట్టూ తిరుగుతుంది, ఏ తప్పు చేయకపోయినా నేరం చేశాడనే ఆరోపణతో అతనిపై కేసు నమోదవుతుంది. న్యాయం కోసం ఆడే పోరాటాన్ని ఈ కథ ప్రధానంగా చూపిస్తుందనేది తాజా సమాచారం.
రామ్ జగదీష్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దాంట్లో లేడీ జస్టిస్ కోర్టులో సాక్షి బాక్స్ లో నిలబడినట్లు చూపించారు. ఆమె కళ్లకు కట్టిన కట్టు న్యాయం ప్రాతిపదికగా వ్యవహరించే సంకేతంగా ఉండగా, ఆమె చేతిలోని కత్తి సత్యం కోసం చేసే పోరాటానికి ప్రతీకగా ఉంది.
అలాగే పోస్టర్ లో పావురాలు ఎగిరే దృశ్యాలు అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది న్యాయం కోసం జరిగే పోరాటంలో ఎదురయ్యే సంక్షోభాన్ని సూచిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. హీరో ప్రియదర్శిపై ముహూర్తం షాట్ తీయగా, నాని క్లాప్ కొట్టాడు, నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. తొలి సన్నివేశానికి జెమిని కిరణ్ దర్శకత్వం వహించారు.
రేగ్యూలర్ షూట్ సెప్టెంబర్ నెల నుండి మొదలు కానుంది. ఈ సినిమాలో శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష రోషన్, శ్రీ దేవి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు అత్యుత్తమ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, విజయ్ బుల్గనిన్ సంగీతం అందించనున్నారు. విఠల్ కోసనం ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ తో పాటు స్క్రీన్ ప్లే రచనలో కార్తికేయ శ్రీనివాస్ వంశీధర్ సిరిగిరి వర్క్ చేస్తున్నారు. ఇది ప్రాధాన్యత గల కథతోపాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం అవుతుందని తెలుస్తోంది.