నాని మూవీ ఆగలేదా.. చేతులు మారిందా?
నాని బ్యాక్ టు బ్యాక్ 'హిట్ 3', 'ది ప్యారడైజ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిట్ 3 నుంచి టీజర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
By: Tupaki Desk | 8 March 2025 12:20 PM ISTనాని బ్యాక్ టు బ్యాక్ 'హిట్ 3', 'ది ప్యారడైజ్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిట్ 3 నుంచి టీజర్ అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటికే హిట్ ప్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఈసారి నాని హీరోగా నటించడంతో హిట్ 3 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగింది. హిట్ 3 తో నాని మార్కెట్ అనూహ్యంగా పెరగడం ఖాయం అనే అభిప్రాయంను బాక్సాఫీస్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ది ప్యారడైజ్ సినిమా ఊహకు సైతం అందనంత ఎత్తులో ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ప్యారడైజ్ పిచ్చెక్కించేలా ఉందని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.
2025లోనే ఈ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మరో సినిమాను సైతం నాని లైన్‌లో పెట్టిన విషయం తెల్సిందే. ముందుగా అనుకున్న ప్రకారం అయితే ఈ రెండు సినిమాల కంటే ముందు సాహో సుజీత్ దర్శకత్వంలో నాని సినిమా చేయాల్సి ఉంది. కానీ సుజీత్‌కి పవన్ కళ్యాణ్ ఓజీని చేసే అవకాశం దక్కడంతో నాని సినిమాను హోల్డ్‌లో పెట్టారు. పలు ఇంటర్వ్యూల్లో సుజీత్, నాని మాట్లాడుతూ తమ కాంబో మూవీని రద్దు చేయలేదని, పక్కకు పెట్టామని, ఓజీ సినిమా విడుదల తర్వాత మా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల ఓజీ ఆలస్యం అవుతూ వస్తున్న విషయం తెల్సిందే.
ఓజీ సినిమా షూటింగ్‌కి పవన్ డేట్లు ఇవ్వడంతో ముగింపు దశకు చేరింది. ఈ సమ్మర్ చివరి వరకు ఓజీని ముగించాలని దర్శకుడు సుజీత్ పట్టుదలతో ఉన్నాడు. ఓజీ విడుదలైన వెంటనే నానితో సినిమాను పట్టాలెక్కించే విధంగా సుజీత్ రెడీగా ఉన్నాడు. కొన్ని నెలల క్రితం నాని, సుజీత్ సినిమా రద్దు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అందుకు కారణం దానయ్య బడ్జెట్ ఎక్కువ కావడంతో తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిజంగానే దానయ్య సినిమా నిర్మాణం నుంచి తప్పుకున్నారు. కానీ ఆయన స్థానంలో నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం అందుతోంది. నిహారిక బ్యానర్‌లో నాని ఇప్పటికే ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే.
నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాను నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లోనే నిర్మించిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో నానికి నిహారిక బ్యానర్ నిర్మాత వెంకట్ బోయనపల్లితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే నానితో సినిమాను నిర్మించేందుకు ఆయన రెడీ అయ్యారు. నాని సైతం శ్యామ్ సింగరాయ్ ఫలితం నేపథ్యంలో ఈ సినిమా నిర్మాణ బాధ్యతను ఆయనకు అప్పగించారని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఓజీ సినిమా తర్వాత నానితో సుజీత్ చేయబోతున్న సినిమా సైతం మాఫియా బ్యాక్‌డ్రాప్ అనే వార్తలు వస్తున్నాయి. మాఫియా నేపథ్యంలో నాని సినిమా అంటే ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.