సరిపోదా శనివారం.. తమిళంలో పరిస్థితి ఎలా ఉందంటే..
టాలీవుడ్ హీరోలు ఇప్పుడిప్పుడే ఇతర ఇండస్ట్రీలో కూడా వారి మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Tupaki Desk | 2 Sep 2024 3:41 PM GMTటాలీవుడ్ హీరోలు ఇప్పుడిప్పుడే ఇతర ఇండస్ట్రీలో కూడా వారి మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కంటెంట్ బలంగా క్లిక్కయితే ఒక్క రాత్రిలోనే ఏ ఇండస్ట్రీలో అయినా 50 నుంచి 100 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మన హీరోలు హిందీలో జెండా పాతినా తమిళంలో మాత్రం ఇంకా స్థిరంగా మార్కెట్ పై పట్టు సాధించడం లేదు. అక్కడి జనాలను ఎట్రాక్ట్ చేయడం అంత సాధారణ విషయం కాదు.
అయితే తమిళ హీరోల సినిమాలకు మాత్రం తెలుగులో ఒక మంచి మార్కెట్ ఉంది. అక్కడి స్టార్స్ కు ఇక్కడ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది.
ఇక మన నాని అప్పుడప్పుడు తమిళ ఆడియెన్స్ ను బలంగా ఎట్రాక్ట్ చేస్తూ ఉండడం విశేషం. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా తమిళ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటోంది. తమిళ ప్రేక్షకులు సాధారణంగా తెలుగు సినిమాలకు పెద్ద ఆదరణ చూపించరు, కానీ నానికి మాత్రం అక్కడ కొన్ని ప్రత్యేకమైన విజయాలు ఉన్నాయి.
నాని తన కెరీర్లో ‘వెప్పం’ ‘ఈగ’ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత మరికొంత కాలం పాటు తమిళ మార్కెట్ పై ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. 'దసరా' మరియు 'హాయ్ నాన్న' వంటి సినిమాలు అక్కడ విడుదలైనప్పటికీ, పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్రం తమిళంలో మంచి విజయం సాధిస్తోంది.
ఈ సినిమాను తమిళంలో ‘సూర్యాస్ సాటర్డే’ అనే పేరుతో విడుదల చేశారు. హిందీలో, కన్నడలో సినిమా రిలీజ్ నామమాత్రమే కాగా, మలయాళంలో పరిస్థితి సాధారణంగా ఉందా, కానీ తమిళంలో మాత్రం సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద తమిళంలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో నటించడం, ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
రిలీజ్ తర్వాత ప్రేక్షకుల స్పందన కూడా పాజిటివ్‌గా ఉండడంతో, సినిమా అక్కడ బాగా ఆడుతోంది. తెలుగులో ‘సరిపోదా శనివారం’కు వచ్చిన టాక్‌తో పోలిస్తే, తమిళంలో క్రిటిక్స్ నుంచి అలాగే ఆడియెన్స్ నుంచి మంచి రివ్యూలు దక్కాయి. ఫస్ట్ డే నుంచే మంచి వసూళ్లను సాధించడంతో, శని, ఆదివారాల్లో మాత్రమే కాకుండా సోమవారం కూడా ఆక్యుపెన్సీ బాగా ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు వెర్షన్ తరువాత, తమిళం నుంచే ఈ సినిమాకు సాలీడ్ వసూళ్లు వస్తున్నాయి. తమిళంలో ‘సరిపోదా శనివారం’ పది కోట్ల గ్రాస్ సేకరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.