నాని - విజయ్ మధ్య విబేధాలు.. ఓ ఆన్సర్ ఇచ్చేశారు
ఫొటోల్లో ఇద్దరూ మోటార్ బైక్‌పై కూర్చొని అప్పటి జ్ఞాపకాలను తలచుకుంటూ సందడి చేశారు. ఈ మోమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By: Tupaki Desk | 12 March 2025 6:44 PM ISTసినిమా పరిశ్రమలో రూమర్స్ రావడం, హీరోల మధ్య అనుకోని గాసిప్స్ వైరల్ కావడం కామన్. గత కొంత కాలంగా నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మధ్య విబేధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ తాజాగా ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ మధ్య నెలకొన్న సందేహాలకు తెరపడింది. 2015లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇద్దరూ కలిసి పని చేశారు. ఇప్పుడీ సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ కు సిద్ధమైంది.
ఈ సందర్భంగా జరిగిన వేడుకలో నాని - విజయ్ దేవరకొండ తమ బాండింగ్‌ను మరోసారి నిరూపించారు. వీరి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ టైమ్‌లో చిన్న సినిమానే. కానీ విడుదల అనంతరం ఎవ్వరూ ఊహించని రీతిలో గుర్తింపుని అందుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ చిత్రం, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఒక ప్రయాణం నేపథ్యంలో సాగే కథ, సంతోషం, భావోద్వేగాలు, ఆత్మాన్వేషణ.. ఇలా అన్ని ఎమోషన్స్‌ను టచ్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ అందరికీ ప్రత్యేకమైనది. అందుకే, 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ప్రత్యేక రీ రిలీజ్ ప్లాన్ చేశారు. మార్చి 21న ఎవడే సుబ్రహ్మణ్యం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వేడుకలో ముఖ్యంగా హైలైట్ అయిన విషయం ఏమిటంటే, విజయ్ దేవరకొండ - నాని కలిసి సినిమాలోని ఓ ప్రముఖ సీన్‌ను మళ్లీ రిక్రియేట్ చేశారు.
ఫొటోల్లో ఇద్దరూ మోటార్ బైక్‌పై కూర్చొని అప్పటి జ్ఞాపకాలను తలచుకుంటూ సందడి చేశారు. ఈ మోమెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సందర్భంలో నాని - విజయ్ దేవరకొండ మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసేలా వారిద్దరి ముచ్చట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. తాము ఎప్పటినుంచో మంచి స్నేహితులమేనని, బయట పుట్టే ఊహాగానాలు అప్రస్తుతం అని సింపుల్ గా క్లారిటీ ఇచ్చారు.
మొన్నటివరకు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన బలంగా ఉండేది. విజయ్ దేవరకొండ, నాని సినిమాల పోటీ, వారి ఫ్యాన్స్ మధ్య చర్చలు.. ఇవన్నీ వారిద్దరి మధ్య మైండ్ గేమ్ నడుస్తోందనే ప్రచారాన్ని మోదలుపెట్టాయి. అయితే, ఈ వేడుకలో మాత్రం ఇద్దరూ ఆనందంగా కలిసి మెలిసి ఉన్న సందర్భాలు ఆ రూమర్స్‌కు బ్రేక్ వేసాయి. ముఖ్యంగా, నాని ఇటీవల కింగ్‌డమ్ టీజర్‌ను మెచ్చుకోవడం, విజయ్ దేవరకొండ దానికి స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేయడం – వీరి మధ్య నిజంగా ఎలాంటి వివాదాలు లేవనే విషయాన్ని రుజువు చేసింది.
ప్రస్తుతం వీరి కెరీర్‌కు వస్తే, నాని హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మిస్టరీ, థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంచనాలు భారీగా ఉన్నాయి. మరోవైపు, విజయ్ దేవరకొండ కూడా కింగ్‌డమ్ సినిమాతో మాస్ పాత్రలో మరోసారి తన స్టైల్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక వీరిద్దరూ భవిష్యత్తులో మళ్లీ కలిసి నటించే అవకాశం ఉంటుందో లేదో కాలమే సమాధానం ఇవ్వాలి.